కడపలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మెుత్తం 50 వార్డుల్లో 24 వార్డులు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 26 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా.. ఎన్నికల అధికారి సూచన మేరకు ఏదో ఒక గుర్తింపు కార్డు ఉంటేనే ఓటర్లను అనుమతిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వైద్య సిబ్బంది.. ఓటర్లను పరీక్షించి పంపిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
కడపలో..
కడప కార్పొరేషన్ ఎన్నికలో ఎక్కువగా మహిళ ఓటర్లు హాజరు కావడం విశేషం. నడవలేని వారు, వృద్ధులు సైతం ఓటు వేసేందుకు వస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అధికార పార్టీ నాయకులు డబ్బులు పంచుతున్నారు. ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా కడపలోని 29వ డివిజన్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 23వ వార్డులో దొంగ ఓటు వేస్తున్న వ్యక్తి ని ఏజెంట్లు గుర్తించారు
ప్రొద్దుటూరులో...
ప్రొద్దుటూరులో పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. 11వ వార్డులో భాజపా తరఫున ముక్కు పుడకలు పంపిణీ చేస్తున్నారు. ఇది గమనించిన పోలీసులు.. ముక్కు పుడకలు పంపిణీ చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
జమ్మలమడుగులో..
ఉదయం 7 గంటలకే జమ్మలమడుగులో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మున్సిపాలిటీలో 20 వార్డుల్లో రెండు ఏకగ్రీవం కాగా.. 18 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 11 గంటలకు 34% పోలింగ్ నమోదు అయినట్లు సహాయ ఎన్నికల అధికారి వెంకట రామి రెడ్డి తెలిపారు. ఒకటో వార్డులో పోలీసులకు ఒక వర్గానికి చెందిన అనుచరులతో ఘర్షణ వాతావరణం నెలకొంది. 8,9,14,15 వార్డులలో అధికంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
రాయచోటిలో..
రాయచోటి పురపాలక సంఘంలోని 23,24,25 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచే మహిళలు, వృద్ధులు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. కేంద్రాల్లోకి అనుమతి లేకపోయినా అధికార పక్ష నాయకులు యథేచ్ఛగా కేంద్రాలకు వెళుతూ ఓటర్లను ఓటు అభ్యర్థిస్తున్నారు. తెదేపా అభ్యర్థులు అభ్యంతరం తెలిపిన పట్టించుకోకపోవడంతో కొన్ని కేంద్రాల్లో ఏకపక్షంగానే పోలింగ్ సాగుతోంది.
బద్వేల్లో..
బద్వేల్ పురపాలక 35 వార్డులు ఉండగా 10 వార్డులు వైకాపా ఏకగ్రీవం చేసుకుంది.. 25 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ నిఘాను కట్టుదిట్టం చేశారు. 19 వార్డు పోలింగ్ బూత్‌లో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ బెదిరిస్తున్నారని స్వతంత్ర అభ్యర్థి వెంకటసుబ్బయ్య తరఫున ఉన్న జనరల్ ఏజెంట్ గంగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో.. 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీల్లో మొదలైన పోలింగ్