కనిపెంచిన తల్లి అనీ... తోడపుట్టిన సోదరుడనే బంధం మర్చిపోయాడా కర్కశుడు... తాగొచ్చి అమ్మను, సోదరుడిని కొడుతున్నాడు... మిగిలిన బిడ్డల దగ్గరైనా తల దాచుకునేందుకు వెళ్తే... వారినీ ఇబ్బందులు పెడుతూ... దుర్భాషలు ఆడుతున్నాడు.. నా కుమారుడు నుంచి మమ్మల్ని రక్షించండి అంటూ కడప జిల్లా రైల్వే కోడూరు పోలీసు స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసిందా మాతృమూర్తి.
అసలు ఏం జరిగిందంటే...
కడప జిల్లా రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేటకు చెందిన సుబ్బమ్మకు ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు. అందరికీ పెళ్లిళ్లు చేసింది.. 10 సంవత్సరాల క్రితం భర్త వెంకటసుబ్బయ్య చనిపోయాడు. అప్పటినుంచే తన చిన్నకుమారుడు నారాయణ ఇబ్బంది పెడుతున్నాడని సుబ్బమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. తన కుమార్తెల వద్దకు వెళ్లినా వారిని దుర్భాషలాడుతూ ఎవరి వద్దకు వెళ్లొద్దని హెచ్చరించాడని వాపోయింది.
ఓ ప్రమాదంలో తన రెండో కుమారుడు రెండు కాళ్లు పని చేయకుండా పోయాయనీ... అతడని ఆలనాపాలనా తానే చూసుకుంటున్నట్లు సుబ్బమ్మ వివరించింది. వికలాంగుడైన సోదరుడనీ చూడకుండా... అతడిని సైతం నారాయణ కొడుతున్నాడని కన్నీరు పెట్టుకుంది. ఆ దెబ్బలు తాళలేకే పోలీసులను ఆశ్రయించినట్లు సుబ్బమ్మ తెలిపింది. పోలీసులైనా తమను రక్షించి.. న్యాయం చేయాలని వేడుకుంటోంది.
ఇదీ చదవండి: ఇరు వర్గాల మధ్య స్థల వివాదం..ఘర్షణలో వ్యక్తి మృతి