కడప జిల్లా మైదుకూరులో రూ. 31 కోట్లతో వంద పడకల ఏరియా ఆసుపత్రిని నిర్మించబోతున్నట్లు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తెలిపారు. ఆసుపత్రి భవన నిర్మాణాల కోసం ఆరెకరాల స్థలాన్ని ఎంపిక చేసినట్లు ఎంపీడీఓ కార్యాలయంలో చెప్పారు. ఇప్పటికే 30 పడకల ఆసుపత్రి వద్ద రూ. 3 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్లు వివరించారు. కుందూనదిపై రాజోలి, జొలదరరాశి రిజర్వాయర్ల నిర్మాణ పనులు జనవరిలో ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ఈరెండింటి మధ్య 3 టీఎంసీలతో మరో జలాశయం నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయన్నారు. ఈ పనులకు రూ. 30 కోట్లు మాత్రమే అవసరం అవుతుందని వివరించారు.
వరదల సమయంలో శ్రీశైలం జలాశయం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 80వేల క్యూసెక్కులు నీరు తీసుకునేలా కాల్వలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. సకాలంలో పనులు పూర్తి చేస్తే రాయలసీమకు తక్కువ రోజుల్లో ఎక్కువ నీరు పొందే అవకాశం ఉందన్నారు. తెలుగుగంగ పథకంలో భాగమైన బ్రహ్మంసాగర్ జలాశయంలో ఈ సంవత్సరం 14.3 టీఎంసీలు నీరు నిల్వ చేశామని... వచ్చే ఏడాది 17 టీఎంసీలు నిల్వ చేస్తామన్నారు. బ్రహ్మంసాగర్ కట్ట లీకేజీ నివారణకు రూ. 48 కోట్లతో డయాఫ్రంవాల్ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
రాష్ట్రానికీ నివర్ ముప్పు... చిత్తూరు జిల్లాను తాకనున్న తీవ్ర తుపాను