కడప జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. బాధితులకు అవసరమైన ఆక్సిజన్ పడకలు అందుబాటులో లేని కారణంగా.. కొవిడ్ రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల గణాంకాల ప్రకారం ఈ నెల ఆరో తేదీ నాటికి జిల్లాలో పాజిటివిటీ రేటు 28.7శాతం ఉండగా... 13 నాటికి 41.62 శాతం, 26 నాటికి 54.53 శాతానికి చేరుకునే అవకాశం ఉందని వైద్యాధికారులు అంచనా వేస్తున్నారు.
కర్ణాటక నుంచి దిగుమతి...
జిల్లా అవసరాలు తీర్చేందుకు పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోని బళ్లారి నుంచి రోజుకు 17.5 కిలోలీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా అవుతోంది. వీటితోపాటు కడప పారిశ్రామికవాడలోని ఓ పరిశ్రమ 3 కిలోలీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తోంది. అయినప్పటికీ ఆక్సిజన్ కొరత వేధిస్తూనే ఉంది. ఈ గణాంకాలను పరిశీలిస్తే... ఈనెల 26 నాటికి 75.4 కిలోలీటర్ల ఆక్సిజన్ అవసరం అవుతుందని సంబంధిత అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు.
ఆక్సిజన్ సరఫరా లేకపోవడంతో...
కడప రిమ్స్‌లో 13 కిలోలీటర్ల సామర్థ్యం గల ఆక్సిజన్ ట్యాంక్ ఉంది. ప్రతి గంటకు ఆక్సిజన్ నిల్వ వివరాలను కలెక్టర్‌కు అందిస్తున్నారు. ఈ ట్యాంక్ పక్కనే 20 కిలోలీటర్ల సామర్థ్యంతో మరో ఆక్సిజన్ ట్యాంక్ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రిమ్స్ ఇన్‌పేషెంట్ బ్లాక్‌లో 450 ఆక్సిజన్ పడకల ద్వారా చికిత్స అందిస్తున్నారు. ఇదే బ్లాకులో మరో 750 ఆక్సిజన్ బెడ్లు సిద్ధం చేసినా... ఆక్సిజన్ సరఫరా లేకపోవడంతో అందుబాటులోకి తీసుకురాలేదని వైద్యాధికారులు వెల్లడించారు.
ప్రధానికి లేఖ...
జిల్లాలో కొవిడ్ బాధితులకు అవసరమైన ఆక్సిజన్‌ను అధిక మోతాదులో సరఫరా చేయాలని ఈనెల 8న కడప ఎంపీ అవినాశ్ రెడ్డి.. ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా జిల్లాకు రోజుకు 95.9 కిలోలీటర్ల ప్రాణవాయువును సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు కర్ణాటక నుంచి రోజూ దిగుమతి చేసుకుంటున్న 20 మెట్రిక్ టన్నుల స్థానంలో 150 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేయాలని సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు.
ఇవీ చదవండి: