రైల్వేకోడూరు నియోజకవర్గం మామిడి తోటలకు, ఉద్యాన పంటలకు ప్రసిద్ధి. ఇక్కడ వేల హెక్టార్లలో మామిడి పంటను రైతులు సాగుచేస్తున్నారు. అయితే కరోనా మహమ్మారి వారికి కష్టాలు తెచ్చిపెట్టింది. ఒకపక్క అకాల వర్షాలు, మరో పక్క లేటుగా వచ్చినా మామిడి పూత వాటికి తోడు లాక్ డౌన్ మామిడి రైతులపై పంజా విసిరాయి.
పెట్టుబడి కూడా రాలేదు...
రైల్వేకోడూరు మార్కెట్ యార్డులో దాదాపు రూ.200 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుంది. అయితే లాక్ డౌన్ కారణంగా కనీసం రూ. 5 నుంచి 10 కోట్ల వ్యాపారం కూడా జరగలేదంటూ వ్యాపారులు తెలిపారు. పది ఎకరాల మామిడి తోటకు రూ.3 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టినా కనీసం రూ.50 వేలు కూడా చేతికి రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల కోసం, పురుగుమందుల కోసం లక్షలు వెచ్చించిన అనేకరకాల తెగుళ్లు, అకాల వర్షాల వల్ల దిగుబడి సరిగా రాలేదంటూ వాపోతున్నారు. వచ్చిన పంటను అమ్ముకునేందుకు మార్కెట్ కు తరలించిన గిట్టుబాటు ధర లభించక అప్పుల్లో కూరుకుపోతున్నామంటూ ఆందోళన చెందుతున్నారు.
ఇతర రాష్ట్రాలకు తరలించలేకపోతున్నాం...
మామిడి తోటల నుంచి మార్కెట్ కు తరలించేందుకు ట్రాక్టర్లు అందుబాటులో ఉండటంలేదని రైతులు తెలిపారు. యార్డు నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు రవాణ సదుపాయం లేకపోవటంతో మరింత ఇబ్బందిపడుతున్నామంటూ వాపోయారు. ఇతర రాష్ట్రాల వ్యాపారులు రైల్వేకోడూరు వస్తే వ్యాపారుల మధ్య పోటీ వల్ల ధరలు ఎక్కువగా ఉంటాయని... కానీ వారు రాలేనందువల్ల చుట్టుపక్కల జిల్లాలకు మాత్రమే ఎగుమతి చేసుకోవాల్సి వస్తుందని తెలిపారు. ప్రభుత్వం స్పందించి రవాణా సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.
ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చెయ్యాలి...
రైల్వేకోడూరులో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలంటూ గత దశాబ్ద కాలంగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా ఫలితం రాలేదంటూ వాపోయారు. ప్రభుత్వాలు మారినా ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు. రేటు తక్కువగా ఉన్నప్పుడు నిల్వ ఉంచుకుని గిట్టుబాటు ధర వచ్చినప్పుడు అమ్ముకునేందుకు కోల్డ్ స్టోరేజ్ సహాయపడుతుందని కర్షకులు చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.