Comments on Krishna River Management Board: కృష్ణా నది యాజమాన్య బోర్డును రాయలసీమలో ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి డిమాండు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అనుమతులు లేకుండా కృష్ణానదిపై అనేక ప్రాజెక్టులు నిర్మిస్తున్నా జగన్ మోహన్ రెడ్డి అడ్డుకోవడం లేదని ఆయన విమర్శించారు. రేపు హైదరాబాద్లో కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం జరగనుందని.. ఏపీకి బోర్డు కార్యాలయం తరలించేందుకు నిర్ణయం తీసుకుంటారని ఆయన వెల్లడించారు. రాష్ట్ర విభజన జరిగినా ఇంకా హైదరాబాద్లోనే గోదావరి నదీ యాజమాన్యబోర్డు, కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాలు అక్కడే ఉన్నాయని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలని చంద్రబాబు లేఖలు రాస్తే.. విశాఖ పట్నానికి తరలించాలని జగన్ మోహన్ రెడ్డి లేఖలు రాశారని ఆయన విమర్శించారు. కృష్ణానదిపై నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలోనే అంటే కర్నూలులోనే కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
"గతంలో చంద్రబాబు ప్రభుత్వం కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలని లేఖ రాసింది. కానీ ప్రస్తుతం జగన్ ప్రభుత్వం విశాఖకు తరలించాలని లేఖ రాసింది. విశాఖ.. కృష్ణా నదీ పరివాహక ప్రాంతానికి 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి సమీపంలో ఉన్న ప్రాంతంలో బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయాలి". - తులసిరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత
రాయలసీమలో ప్రవహిస్తున్న కృష్ణా నదికి సంబంధించిన బోర్డును విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం అవివేకమని .. రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిశంకర్ రెడ్డి మండిపడ్డారు. కృష్ణా యాజమాన్య బోర్డు కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. బోర్డును విశాఖపట్నంలో ఏర్పాటు చేయటం వల్ల సీమ ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"కృష్ణానది యాజమాన్య బోర్డు కోసం వర్గ పోరు చేస్తున్నా అని అంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఏ వర్గ పోరు చేస్తున్నారో చెప్పాలి. కృష్ణానది యాజమాన్య బోర్డు కర్నూలులో ఉండాలి". - రవిశంకర్ రెడ్డి, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి
ఇవీ చదవండి: