వైఎస్ఆర్ జిల్లా కొండాపురం మండలంలో నిర్మించిన గండికోట ప్రాజెక్టు నిర్మాణంతో.... 22 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. తెలుగుదేశం హయాంలో నిర్వాసితులకు ..6లక్షల 75వేల రూపాయల చొప్పున పరిహారంతో పాటు పునరావాస కాలనీలో 5 సెంట్ల ప్రకారం స్థలం ఇచ్చారు. రెండున్నర సెంట్లలో బాధితులు ఇళ్లు నిర్మించుకున్నారు. మిగిలిన భూమిని ఖాళీగా పెట్టుకున్నారు. కుటుంబ పోషణ భారంగా మారడంతో ఉపాధి కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో ఏడాదిన్నర కిందట కొండాపురం మండలం ఓబన్నపేట పునరావాసకాలనీకి చెందిన భారతి ఖాళీ స్థలంలో కనకాంబరాల సాగు చేశారు. మంచిలాభాలు రావడంతో... మిగిలిన వాళ్లు కూడా ఆమెనే అనుసరించారు. ఈ విధంగా ఓబన్నపేట, గండ్లూరు, సీతాపురం పునరావాస కాలనీల్లో కనకాంబరాల సాగు చేపట్టారు. ఒక్కరితో మొదలైన పూలసాగు... ఇప్పడు 500 గడపలకు చేరి సిరులు కురిపిస్తోంది. ఏ ఇంటికి వెళ్లినా కనకాంబరాలు ఆహ్లాదంగా స్వాగతం పలుకుతాయి.
వేసవిలో ఎక్కువగా కనకాంబరాలు పూస్తున్నాయి. వీటిని తాడిపత్రి పూల మార్కెట్‌కు తరలించి విక్రయిస్తున్నారు. కిలో కనకాంబరాలు 200 నుంచి 300 రూపాయలకుపైగా ధర పలుకుతోంది. ఒక్కో కుటుంబం నెలకు 6 వేల నుంచి 8 వేల రూపాయల వరకు ఆదాయం పొందుతోంది. ఉపాధి లేక అల్లాడుతున్న తమకు పూలసాగు ఎంతో లాభసాటిగా ఉందని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కుటుంబ పోషణ కోసం పూల సాగు చేపట్టి మూడు గ్రామాల ప్రజలు ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరి స్ఫూర్తితోనే పక్కనున్న చౌటుపల్లె పునరావాసకాలనీ వాసులు కూడా ఇటీవలే కనకాంబరాల సాగు మొదలు పెట్టారు.
ఇదీ చదవండి: ధనుష్ హాలీవుడ్ చిత్రం.. 'గ్రేమ్యాన్' ట్రైలర్ ఆగయా