ఇతర దేశాల నుంచి కడప జిల్లాకు వచ్చిన వారి ద్వారానే కరోనా పాజిటివ్ కేసులు తాజాగా పెరుగుతున్నాయని జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. ఇతర దేశాల నుంచి వచ్చిన 148 మందికి కరోనా సోకిందన్న ఎస్పీ.... లాక్డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత ప్రజలు కూడా ఏమరపాటు లేకుండా మాస్కులు ధరించాలని సూచించారు.
జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు సాధ్యమైనంత మేర వెళ్లకుండా ఉంటే మంచిదన్నారు. గ్రామీణ ప్రాంతాలకు కూడా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున మరో పదిహేను రోజులు ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే వైరస్ అదుపులోకి వస్తుందన్నారు. ఇప్పటికే పాజిటివ్ కేసులు నమోదైన వారందరి ప్రైమరీ కాంటాక్టులు సేకరించినట్లు తెలిపారు. జిల్లాలో నమోదైన 600 పాజిటివ్ కేసుల్లో 50 శాతం మంది డిశ్చార్జ్ అయినట్లు ఎస్పీ వెల్లడించారు.