ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ తో పాటు కోప్పర్తిలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్లపై ప్రత్యేక దృష్టి సారించామని కడప జిల్లా కలెక్టర్ హరికరిణ్ తెలిపారు. అధికారులతో కలెక్టర్ సమావేశమై... ఉక్కు కర్మాగార నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా.. ప్రధానంగా ప్రహరీ గోడ, రోడ్లు, విద్యుత్ సరఫరా, నీటి సౌకర్యాన్ని కల్పించాల్సి ఉందన్నారు. సంబంధిత పనుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ముందుకు వచ్చి జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో చేపడుతోందన్నారు.
ఇప్పటికే 3000 ఎకరాల విస్తీర్ణాన్ని ప్లాంటు నిర్మాణం కోసం సేకరించామని కలెక్టర్ వివరించారు. ఆర్ అండ్ బి శాఖ ద్వారా అటవీశాఖ పరిధుల నిబంధనలను పరిగణలోకి తీసుకుంటూ.. ప్లాంటు సరిహద్దులను త్వరగా నిర్ణయించాలన్నారు. అనంతరం ప్రధాన ముఖద్వారం, రెండో గేటు, అందుకు అనుబంధంగా.. అవసరమైన రోడ్లను నిర్మించాల్సి ఉందన్నారు. రహదారుల నిర్మాణం కోసం సర్వే డిపార్టుమెంట్ సిబ్బంది ద్వారా స్థలాలను గుర్తించి లేఅవుట్లు వేయాలని ఆదేశించారు.
రోడ్లు, ప్రహరీ గోడ నిర్మాణాలకు సంబంధించి డీపీఆర్లను సిద్ధం చేసి టెండర్లు ఆహ్వానించాలని ఆర్ అండ్ బి అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్లాంటు నిర్మాణం కోసం ప్రధానంగా నీటి వసతి అత్యవసరం కావున... అక్కడి ప్రధాన నీటి వనరు అయిన గండికోట, మైలవరం రిజర్వాయర్ల నుంచి, ఆర్టిపీపీ నుంచి పైప్లైన్ ద్వారా నీరందించేందుకు పనులను చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి ఆర్టీసీలో ఆ ఉద్యోగులను తొలగించడం లేదు: పేర్ని నాని