కడప జిల్లాలో.. లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ పర్యటించారు. రామాపురం మండలం బండపల్లిలో ఉన్న ప్రేమాలయం వృద్ధాశ్రమానికి వెల్లారు. ఆశ్రమ నిర్వహణ, కడప జిల్లాలోని కరువు పరిస్థితులపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్న వారిని సత్కరించారు. రాష్ట్రంలో ప్రధానమైన విద్య, వైద్య, వ్యవసాయం, అవినీతి రహిత సమాజం, స్థానిక సంస్థల బలోపేతం, చట్టబద్ధ పాలన వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని వాటి ద్వారా ప్రజలకు అందించాల్సిన సేవలపై లోతైన అధ్యయనం చేపట్టామని తెలిపారు. అందులో భాగంగా మొదటిసారి విద్యా యాత్రను ప్రారంభించామన్నారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలను ప్రత్యేక మండలిగా ఏర్పాటు చేసి నిధుల కేటాయింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు.
కేంద్రం తీరుపై అసంతృప్తి...
కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి 7 వేల కోట్లు నిధులు ఇవ్వాల్సి ఉన్నా... కేవలం 350 కోట్లు ఇచ్చి సరి పెట్టుకుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అవినీతి రహిత పరిపాలనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. దిగువ శ్రేణి సిబ్బంది నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు అవినీతికి దూరమైనప్పుడే సామాన్యుడికి సైతం అభివృద్ధి ఫలాలు దక్కుతాయన్నారు. విద్యా యాత్ర పూర్తి కాగానే సమగ్రమైన నివేదికలను ఆయా రంగాల అభివృద్ధి కోసం ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.
ఇదీ చదవండి: