రాయలసీమ జిల్లాల్లో కరవు నివారణకు రూ.6,829.15 కోట్ల అంచనా విలువతో మొత్తం అయిదు నీటి పథకాలు చేపట్టేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులో భాగంగా శ్రీశైలం జలాశయం నుంచి నీటిని ఎత్తిపోసే రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటు వివిధ కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని పెంచే పనులు ఉన్నాయి. వీటిని అయిదు విడివిడి ప్రాజెక్టు పనులుగా చేపట్టనున్నారు. 7,045.06 కోట్లతో ప్రతిపాదనలు సమర్పించగా పరిశీలన అనంతరం పై మొత్తానికి పాలనామోదం ఇచ్చారు. వాటి వివరాలు ఇలా..
- రాయలసీమ ఎత్తిపోతల పథకం: దీని కోసం శ్రీశైలం జలాశయం సంగమేశ్వర్ నుంచి రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోయనున్నారు. ఆ నీటిని నేరుగా ఎస్‌ఆర్‌ఎంసీలో కలుపుతారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో కుడి ప్రధాన కాలువ వద్ద కలుపుతారు. ఈ పని అంచనా విలువ రూ.3,825 కోట్లు.
పోతిరెడ్డిపాడు కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని పెంచనున్నారు. బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని కొత్త నీటి ప్రవాహానికి తగ్గట్టుగా మార్పులు చేస్తారు. అంచనా విలువ: రూ.570.45 కోట్లు.
ఎస్‌ఆర్‌బీసీ, గాలేరు నగరి కాలువల లైనింగు: అంచనా విలువ రూ.939.65 కోట్లు. ఈ రెండు కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని 30వేల క్యూసెక్కులకు గోరకల్లు బ్యాలెన్సింగ్ జలాశయం వరకు పెంచబోతున్నారు.
అదనపు ఇన్‌ఫాల్ రెగ్యులేటర్ నిర్మాణం: అంచనా విలువ రూ.36.95 కోట్లు. గోరకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో అదనపు ఇన్‌ఫాల్ రెగ్యులేటర్ నిర్మిస్తారు.
గాలేరు-నగరి, ఎస్‌ఆర్‌బీసీ కాలువల ఆధునికీకరణ అంచనా విలువ రూ.1,457.10 కోట్లు. గోరకల్లు బ్యాలెన్సింగ్ జలాశయం నుంచి అవుకు జలాశయం వరకు గాలేరు-నగరి కాలువను, ఎస్‌ఆర్‌బీసీ కాలువలను ఆధునికీకరించనున్నారు.
ఇదీ చదవండి : మరో 13 శాతం మద్యం దుకాణాలు తగ్గిస్తాం : సీఎం