Demolition of houses: కడప నగరంలో మాసాపేటలో దాదాపు 80 ఏళ్ల నుంచి పేద మధ్య తరగతి ప్రజలు జీవిస్తున్నారు. ఇక్కడున్న వారందరూ పారిశుద్ధ్య కార్మికులు, దినసరి కూలీలు. వీరిలో సగం మంది పైగా నగరపాలక కార్యాలయంలో పారిశుద్ధ్య విభాగంలో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నామన్నారు. మూడు తరాలుగా వారు ఇక్కడ జీవిస్తున్నామని స్థానికులు తెలిపారు. కానీ ఇటీవల రోడ్ల విస్తరణ కార్యక్రమంలో భాగంగా మాసాపేట రోడ్డుకి ఇరువైపులా ఉన్న దాదాపు 100 నివాసాలను అధికారులు జేసీబీతో కూల్చివేశారు.
ఇంకా మరి కొంత మంది ఇళ్లను కూల్చే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. కనీసం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా, పరిహారం చెల్లించకుండా ఉన్న ఇళ్లను కూల్చివేయడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో కూల్చివేసిన మొండి గోడల మధ్య జీవిస్తున్నారు. కూల్చిన ఇళ్లను చూసుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారికి కనీసం ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లను కూల్చివేస్తే ఎక్కడికి వెళ్లాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కొలతలను తగ్గించి నిర్మాణాలను తొలగించాలని మొరపెట్టుకున్నప్పటికీ అధికారులు స్పందించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: