కడప నగరంలోని ఐటీఐ కూడలి సమీపంలో ఉంటున్న ఒక ఉద్యోగి ప్రభుత్వ దంతవైద్య కళాశాలలో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈయన దిల్లీలో విధులు నిర్వహిస్తూ.. ఇటీవల సెలవుపై ఇక్కడికి వచ్చారు. ఈయన కడపకు వచ్చిన వెంటనే పరీక్షలు చేయించుకున్నారు. 13 రోజులు గడిచినా ఫలితం రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
నందలూరు మండలానికి చెందిన ఓ వ్యక్తికి జ్వరం, ఆయాసం ఉండడంతో కడపలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వచ్చారు. కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకుని వస్తేనే చికిత్స అందిస్తామని ఇక్కడి వైద్యులు చెప్పారు. పరీక్షల నిమిత్తం ఫాతిమా వైద్యకళాశాలకు వెళ్లి స్వాబ్ ఇచ్చారు. నాలుగు రోజులు అవుతున్నా ఫలితం రాకపోవడంతో ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నారు.
గత నెల 30న కమలాపురం మార్కెట్‌యార్డులో సంజీవిని వాహనం ద్వారా సుమారు 210 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో కరోనా బాధితుల ప్రాథమిక సన్నిహితులు, అనుమానిత లక్షణాలు ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఇప్పటికీ చాలామందికి ఫలితాలు రాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
కడప నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఓ చిరువ్యాపారి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. వారం రోజులు గడిచినా ఫలితం వెల్లడి కాలేదు. ఆయన ప్రస్తుతం ఎప్పటిలానే పనిచేస్తున్నారు. ఒకవేళ ఆయనకు పాజిటివ్ వస్తే తమ పరిస్థితి ఏమిటని స్థానికులు భయపడుతున్నారు.
సరిపడా యాంటిజెన్ కిట్లు లేవు
జిల్లాలో బుధవారం నాటికి మొత్తం 11,074 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 5,070 మంది చికిత్స పొంది డిశ్చార్జి కాగా.. 121 మంది మరణించారు. ప్రస్తుతం 5,883 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జిల్లాలో పలుచోట్ల కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా కడపలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆర్‌టీ-పీసీఆర్ యంత్రాల ద్వారా కచ్చితమైన ఫలితాన్ని అందిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 20 ట్రూనాట్ పరికరాల సహాయంతోనూ పలు ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అందించిన యాంటిజెన్ కిట్ల సహాయంతో పీహెచ్‌సీ, సీహెచ్‌సీ స్థాయిల్లోనూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. యాంటిజెన్ కిట్ల ద్వారా నిర్వహించే కరోనా పరీక్షల ఫలితాలను ఒకరోజులోపే వెల్లడిస్తున్నారు. అయితే అవసరానికి సరిపడా కిట్లు అందుబాటులో లేకపోవడంతో వీటి ద్వారా ఎక్కువ సంఖ్యలో పరీక్షలు నిర్వహించలేకపోతున్నారు. ఈ కారణంగా ప్రస్తుతం ఆర్‌టీ-పీసీఆర్, ట్రూనాట్ పరికరాల సహాయంతో నిర్వహించే కరోనా పరీక్షల ఫలితాలు చాలా ఆలస్యమవుతున్నాయి.
కారణాలు అనేకం
కరోనా ఉద్ధృతి నేపథ్యంలో రోజురోజుకు పరీక్షించాల్సిన నమూనాల సంఖ్య రెట్టింపు అవుతోంది. ఇందుకు అనుగుణంగా అవసరమైన మేరకు యంత్రాలు, వైద్యసిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఫలితాల వెల్లడిలో జాప్యం చోటుచేసుకుంటోంది. కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్న కొంతమంది వైద్యసిబ్బంది అనారోగ్య సమస్యల బారినపడడంతో ఈ సమస్య తీవ్రమవుతోంది. కొన్ని నమూనాలకు సంబంధించి పరీక్షలు పూర్తయినా.. ఆయా వ్యక్తులకు సమాచారాన్ని చేరవేసే ప్రక్రియ ఆలస్యమవుతోంది. ప్రధానంగా నెగిటివ్ వచ్చిన వారి విషయంలో ఈ సమస్య ఉంది. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో సేకరించిన కొన్ని నమూనాలను కచ్చితమైన ఫలితం కోసం కడపలోని వీఆర్డీఎల్ ల్యాబ్‌కు తరలించాల్సి ఉంటుంది. ఇందుకోసం వాహనంలో రవాణాకు అధిక సమయం పడుతోంది.
కరోనా బారిన వీఆర్డీఎల్ సిబ్బంది
జిల్లాలో కరోనా పరీక్షల నిర్వహణకు ప్రధాన కేంద్రంగా ఉన్న కడప వీఆర్డీఎల్‌లో విధులు నిర్వహించే పలువురు సిబ్బంది కరోనా బారినపడ్డారు. ఈ కారణంగానే గతకొన్నిరోజులుగా ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న నమూనాలను వివిధ మార్గాల్లో పరీక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కొన్ని నమూనాలను తిరుపతికి తరలించి పరీక్షలు నిర్వహించేందుకు కృషి చేస్తాం. - హరికిరణ్, కలెక్టర్, కడప జిల్లా
ఇదీ చదవండి: మోదీ, అయోధ్య, మూడు రికార్డులు!