Viveka murder case: వివేకానంద రెడ్డి హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దంపతులను సీబీఐ విచారించాలని పీసీసీ మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి డిమాండ్ చేశారు. అన్ని దారులు రోమ్ నగరం వైపు ఉన్నట్లు వివేకా హత్య కేసులో ఆధారాలన్నీ సీఎం జగన్ వైపు చూపిస్తున్నాయని ఆరోపించారు. కడప జిల్లా వేంపల్లెలో తులసిరెడ్డి మాట్లాడుతూ.. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కావాలని అడిగి, ముఖ్యమంత్రి అయ్యాక సీబీఐ విచారణ ఎందుకు వద్దన్నారని ప్రశ్నించారు.
ఎర్ర గంగిరెడ్డిపై చార్జీషీటు ఏదీ?..: ఐదవ ముద్దాయిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని వైసీపి పార్టీ నుండి, పదవి నుండి ఎందుకు తప్పించలేదని తులసిరెడ్డి నిలదీశారు. మొదటి ముద్దాయిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డిపై రాష్ట్ర పోలీసులు సకాలంలో ఎందుకు చార్జీషీటు వేయలేదని అడిగారు. సీఐ శంకరయ్య వాంగ్మూలం ఇవ్వడానికి సిద్ధపడి, వెనక్కి తగ్గిన తర్వాత ఆయన సస్పెన్షన్ రద్దు చేసి ప్రమోషన్ ఎందుకు ఇచ్చారని తులసిరెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఆదేశాలు లేకుండా రాష్ట్ర పోలీసులు సీబీఐ అధికారిపై కేసు పెట్టగలరా? అని అనుమానం వ్యక్తం చేశారు.
అన్నీ కేసులకూ నిరంజన్ రెడ్డి ఒక్కరే లాయరా..: ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగత కేసులు, ప్రభుత్వ కేసులు మాత్రమే కాదు వివేకానంద రెడ్డి హత్య కేసులో ముద్దాయిల తరుపున లాయర్ నిరంజన్ రెడ్డి ఒక్కరే వాదించడం వాస్తవం కాదా? అని నిలదీశారు. జగన్, భారతీలతో అవినాష్ రెడ్డి మాట్లాడినట్లు కాల్ డేటా ద్వారా తెలుస్తోందన్నారు. అన్ని దారులు రోమ్ నగరం వైపు ఉన్నట్లు పై వివరాలన్నీ ముఖ్యమంత్రి జగన్ వైపు చూపిస్తున్నాయని ఆరోపించారు. కాబట్టి సీబీఐ అధికారులు ముఖ్యమంత్రి జగన్ దంపతులను విచారించాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: