పోలీసు ఉన్నతాధికారుల బదిలీని తప్పుపడుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి ముఖ్యమంత్రి చంద్రబాబు 7 పేజీల లేఖను రాశారు. ఈసీ ఆదేశాలతో తాను షాక్కుగురయ్యానని... సహజ న్యాయానికి విరుద్దంగా ఈసీ వ్యవహరిస్తోందని లేఖలో పేర్కొన్నారు. వైకాపా ఫిర్యాదుపై కనీసం ప్రాథమిక విచారణ లేకుండా... 24 గంటల్లో చర్యలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. బదిలీ కారణాలు వెల్లడించకపోవడం సరికాదని ఆయన అన్నారు. అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగేలా ఈసీ వ్యవహరిస్తోందని సీఎం ఆరోపించారు.
ఎన్నికల విధుల పరిధిలోకి రాని ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావుని ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించారు. ఫేజ్-1లో ఏపీ ఎన్నికలు రావడం వల్ల సమస్యాత్మక ప్రాంతాల్లో తెదేపా ప్రచారం చేయాల్సి వస్తోందని... ఈ సమయంలో పోలీసు ఉన్నతాధికారుల బదిలీ దుర్మార్గ చర్య అని అన్నారు. మోదీ,జగన్, కేసీఆర్ ఈ కుట్రలకు కారణమని ముఖ్యమంత్రి లేఖలో పేర్కొన్నారు. వివేకా హత్య కేసు సాక్ష్యాలు తుడిచేయడంలో కడప మాజీ ఎంపీ అవినాశ్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని సీఎం ఆరోపించారు. ఈసీకి ఫిర్యాదు చేసిన విజయసాయిరెడ్డిపై ఈడీ కేసులు, వైకాపా అధినేతపై 31 కేసులున్నాయని వెల్లడించారు. ఇలాంటి వ్యక్తులిచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి విచారణ లేకుండా చర్యలెలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఫారం-7 దరఖాస్తుల దుర్వినియోగం విషయంలో వైకాపాపై తాము ఇచ్చిన ఫిర్యాదును ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. ఎన్నికల సంఘం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించి.. బదిలీలను వెనక్కు తీసుకోవాలని కోరారు. సాధారణ బదిలీల్లో భాగంగానే వెంకటరత్నం శ్రీకాకుళం జిల్లాకు బదిలీ అయ్యారన్నారు. వివేకా హత్య కేసులో కడప ఎస్పీ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని లేఖలో స్పష్టం చేశారు. కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో కడప ఎస్పీ బదిలీ వెనుక కారణాలేంటని ఆయన ప్రశ్నించారు.