ప్రభుత్వాలు అవలంభిస్తోన్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ... కడప జిల్లా కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుల వల్ల రైతులు, వినియోగదారులకు తీరని నష్టం కలుగుతోందని జిల్లా కార్యదర్శి నాగ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కార్పొరేట్ సంస్థలకు వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టేందుకు కేంద్రం ఈ బిల్లులను తీసుకొచ్చిందని ఆయన ఆరోపించారు.
రాజంపేటలో ధర్నా..
రైతులను నట్టేట ముంచేందుకు ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రవికుమార్, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్ఎస్ రాయుడు డిమాండ్ చేశారు. కడప జిల్లా రాజంపేట సబ్‌కలెక్టర్ కార్యాలయం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమానికి వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని రవికుమార్ ఆరోపించారు.
కరోనా వైరస్ కారణంగా ఉపాధి అవకాశాలు కోల్పోయిన కార్మికులను ఆదుకోవాల్సింది పోయి... వారిని ఇబ్బందులకు గురి చేసే కార్యక్రమాలను చేపడుతున్నాయని ఎన్ఎస్ రాయుడు విమర్శించారు. ఇప్పటికైనా రైతు వ్యతిరేక బిల్లును రద్దు చేయాలని....లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: సీఎం జగన్ ఇంటి ముట్టడికి భజరంగ్‌దళ్ యత్నం.. ఉద్రిక్తం