TDP Chief Chandrababu Jammalamadugu Tour: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆర్భాటాలు తప్పితే రాష్ట్ర ప్రజలకు చేసింది శూన్యమని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. రాయలసీమ ప్రాజెక్టులకు టీడీపీ హయంలో 12 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే.. వైసీపీ హయాంలో జగన్ రెడ్డి కేవలం 2000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారని ఆరోపించారు. 'సాగునీటి ప్రాజెక్టుల సందర్శన'లో భాగంగా చంద్రబాబు వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు సర్కిల్‌లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భగా సీఎం జగన్, వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Chandrababu Projects Tour: చంద్రబాబు ప్రాజెక్టుల టూర్.. తెలుగు తమ్ముళ్ల సందడి
స్థానిక టీడీపీ యువ నాయకుడు భూపేష్‌కు ప్రజలంతా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చికెన్ దుకాణాల వద్ద కూడా కమిషన్లు తీసుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. రాయలసీమను దోచుకోవాలనే ఆలోచన తప్ప సీమ ప్రాజెక్టులకు మేలు చేయాలనే తపన ముఖ్యమంత్రికి లేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలను ఆదుకోవడంతోపాటు యువతను.. ముఖ్యంగా ప్రాజెక్టులను సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చారు. జమ్మలమడుగు నుంచి చంద్రబాబు గండికోట ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరారు.
"సీఎంకు ప్రజలను దోచుకోవాలనే తప్ప.. మేలు చేయాలని లేదు. సీఎం జగన్ కొత్తగా ఒక్క ప్రాజెక్టు తెచ్చారా?. సీఎం జగన్ కొత్తగా ఒక్క ఎకరాకైనా నీరిచ్చారా?. టీడీపీ హాయంలో సీమ ప్రాజెక్టులకు రూ.12వేల కోట్లు ఖర్చు చేశాం. జగన్.. కేవలం రూ.రెండు వేల కోట్లే ఖర్చు చేశారు."-చంద్రబాబు, టీడీపీ అధినేత
రైతులతో చంద్రబాబు ముఖాముఖి: అంతకుముందు జమ్మలమడుగులో రైతులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. రాజోలి ఆనకట్ట ముంపు బాధితులతో సమావేశమయ్యారు. రాజోలి ముంపు రైతుల సమస్యలను తెలుసుకున్న చంద్రబాబు.. అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
పులివెందులలో టీడీపీ ఫ్లెక్సీల చించివేత..: పులివెందులలో తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. టీడీపీ ఎమ్మెల్సీ రామ్‌గోపాల్‌రెడ్డి నివాసానికి సమీపంలో ఈ సంఘటన జరిగింది. టీడీపీ నాయకులు వారిని వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
రేపు అనంతపురంలో పర్యటన: రాష్ట్రవ్యాప్తంగా నీటి ప్రాజక్టుల పరిశీలనలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈరోజు కడప జిల్లా పులివెందులలో బహిరంగ సభ అనంతరం.. ముదిగుబ్బ మీదుగా రాత్రికి అనంతపురం చేరుకోనున్నారు. పర్యటనలో భాగంగా నిలిచిపోయిన పేరూరు కాలువ పనులను పరిశీలించనున్నారు. ఆత్మకూరు మండలం శింగనగుట్ట వద్ద పేరూరు కాలువపై నిర్మించిన పంప్ హౌస్‌ను కూడా పరిశీలించనున్నారు.