మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసు దర్యాప్తు చేస్తున్న పర్యవేక్షణ అధికారిని ఉన్నతాధికారులు మార్చారు. సీబీఐలో డీఐజీ ర్యాంకు హోదాలో దాదాపు ఏడాది నుంచి వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి సుధాసింగ్ను మార్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేసులో పలువురు కీలక అనుమానితులను కడప కేంద్ర కారాగారం అతిథి గృహానికి పిలిపించి విచారించారు. ఈ దర్యాప్తు విచారణకు డీఐజీ సుధాసింగ్ నేతృత్వం వహిస్తున్నారు.
మూడు రోజుల కిందట ఆమెను దర్యాప్తు బాధ్యతల నుంచి మార్చి మరో అధికారిని నియమించినట్లు సమాచారం. సీబీఐ డీఐజీ సుధాసింగ్ స్థానంలో ఎస్పీ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించినట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. వివేకా కేసు కీలక దశకు చేరుకున్న సమయంలో ఉన్నతస్థాయి అధికారిని మార్చడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కేసులో ఇప్పటికే 30 మందికి పైగానే కీలక అనుమానితులను సీబీఐ అధికారులు నాల్గోదఫా విచారించారు. ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, డ్రైవర్ దస్తగిరి, సునీల్ కుటుంబం, జగదీశ్వర్ రెడ్డి సోదరులు, వాచ్ మెన్ రంగన్న, పని మనుషులను విచారించారు. ఇవాళ వాచ్ మెన్ రంగన్నను సీబీఐ అధికారులు విచారించారు. కొత్త ఎస్పీ స్థాయి సీబీఐ అధికారి ఇంకా కడపకు రాలేదని సమాచారం.
ఇదీ చదవండి: