కడప జిల్లా పులివెందులకు చెందిన మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ... ఆయన ఆర్థిక లావాదేవీలపై నిఘా పెట్టి విచారణ చేస్తోంది. రెండోవిడత విచారణలో భాగంగా 12 రోజుల నుంచి కడప, పులివెందులలో పది మంది సీబీఐ అధికారులు... పలువురు అనుమానితులను విచారిస్తున్నారు. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఇందులో భాగంగానే పులివెందులకు చెందిన చెప్పుల దుకాణం యజమాని మున్నాను సీబీఐ అధికారులు మూడు రోజుల కిందట కడపలో విచారించారు. అతనితో పాటు వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులను ప్రశ్నించారు. తమదైన శైలిలో ప్రశ్నల వర్షం కురిపించి... వివేకాతో మున్నాకు ఉన్న ఆర్థిక లావాదేవీల వివరాలను రాబట్టినట్లు తెలుస్తోంది. ఫలితంగానే మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు పులివెందులలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో మకాం వేశారు. ఈ బ్యాంకులోనే చెప్పుల దుకాణం యజమాని మున్నాకు బ్యాంకు ఖాతా, లాకర్లు ఉన్నాయి.
లాకర్లో భారీగా నగదు
మున్నా పేరుతో లాకర్లో 48 లక్షల రూపాయల నగదు, 25 తులాల బంగారం ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. ఇంకా ఇతర బ్యాంకుల్లో కూడా మున్నా పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్లు ఆరా తీసింది. అతని పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాల లావాదేవీలు, లాకర్లు నిలిపివేయాలని బ్యాంకు అధికారులకు సీబీఐ సూచించింది. మున్నా మూడు నెలల కింద చెప్పుల దుకాణం మూసేసినట్లు తెలుస్తోంది. అనంతరం కుటుంబాన్ని అనంతపురం జిల్లా కదిరికి మార్చినట్లు సమాచారం. సీబీఐ అధికారులు కదిరికి వెళ్లి మున్నాను తీసుకొచ్చి కడపలో విచారించారు. అప్పులు ఎక్కువ కావటంతో ఐపీ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని పులివెందులలో ప్రచారం జరుగుతోంది. అలాంటి వ్యక్తికి చెందిన బ్యాంకు లాకర్లో 48 లక్షల రూపాయలు, 25 తులాల బంగారం ఉండటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అంత డబ్బు ఎక్కడిది?
మున్నాకు సంబంధించిన ఆస్తులు, ఇతర వ్యవహారాల్లో వివేకా సెటిల్మెంట్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై తమకున్న సమాచారం మేరకు సీబీఐ అధికారులు.. మున్నాపై దృష్టి సారించారని తెలుస్తోంది. సీబీఐ అధికారుల్లోని ఓ బృందం పులివెందులలో మకాం వేసింది. వారు కేవలం అనుమానితుల బ్యాంకుల ఖాతాలు, రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. వివేకాతో ఇంకా ఎవరెవరు ఆర్థిక లావాదేవీలు నిర్వహించారనే కోణంలో ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
వివేకా హత్య కేసులో ఆర్థిక లావాదేవీల కోణంపై ప్రాథమికంగా దృష్టి సారించి దర్యాప్తు చేస్తున్న సీబీఐ... దీని వెనక పాత్రధారులు, సూత్రధారులు ఎవరనే దానిపై రహస్యంగా సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో రాజకీయ కోణం ఏమైనా ఉందా అనేది కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం.