cbi chargesheet in Viveka Murder Case: వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ ఛార్జిషీట్ వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ 26న పులివెందుల కోర్టులో దాఖలు చేసిన ఈ ఛార్జిషీట్లో నలుగురు నిందితులను చేర్చింది. ఇందులో ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి పేర్లను చేర్చింది.
ఛార్జిషీట్లో వివేకా హత్య జరిగిన రోజు ఘటనపై సీబీఐ ప్రస్తావించింది. ఆధారాలు లేకుండా చేయడంలో ప్రముఖల పాత్రలపై పలు విషయాలను పేర్కొంది. 'వివేకా గుండెపోటుతో చనిపోయినట్లు ప్రచారం చేశారు. ప్రచారంలో వైఎస్ అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌రెడ్డిది కీలకపాత్ర. ప్రచార చర్చల్లో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఇందులోనూ మనోహర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి ఉన్నారు. ఎర్ర గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి సూచనల మేరకు బెడ్ రూమ్, బాత్‌రూమ్‌లను పని మనుషులు శుభ్రం చేశారు. శవపరీక్ష నివేదికలో వివేకాకు ఏడుచోట్ల బలమైన గాయాలయ్యాయి. వివేకాను హత్యచేయడానికి నలుగురు ఇంట్లోకి వెళ్లారు. ఇందులో ఎర్ర గంగిరెడ్డి, సునీల్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి ఉన్నారు. వివేకా హత్యకు 2019 ఫిబ్రవరి 10న ఎర్ర గంగిరెడ్డి ఇంట్లో ప్రణాళిక జరిగింది. బెంగళూరులో రూ.8 కోట్ల స్థలం సెటిల్‌మెంట్ విషయమై వివేకా, ఎర్రగంగిరెడ్డి మధ్య విభేదాలు వచ్చాయి. వివేకాను చంపితే సుపారీ ఇస్తారని ఎర్ర గంగిరెడ్డి చెప్పినట్లు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారు. తమ వెనక పెద్దలున్నారని ఎర్ర గంగిరెడ్డి చెప్పినట్లు దస్తగిరి పేర్కొన్నారు. పెద్దల్లో అవినాష్, భాస్కర్, మనోహార్, శివశంకర్ ఉన్నారని గంగిరెడ్డి చెప్పినట్లు దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో నమోదైంది' అని సీబీఐ ఛార్జిషీట్లో పేర్కొంది.
మళ్లీ విచారణ.. రంగంలోకి సీబీఐ..
YS Viveka Murder Case: మరోవైపు వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ మళ్లీ మొదలైంది. ఇవాళ పులివెందుల అర్ అండ్ బీ అతిథి గృహంలో.. ముగ్గురు అనుమానితులు విచారణకు హాజరయ్యారు. నెల్లూరు జిల్లా సాక్షి విలేకరి బాలకృష్ణారెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. వివేకా హత్య జరిగిన సమయంలో.. బాలకృష్ణారెడ్డి కడప సాక్షి విలేకరిగా పని చేశారు. వివేకా గుండెపోటుతో చనిపోయారంటూ.. శివశంకర్‌రెడ్డి బాలకృష్ణారెడ్డికి ఫోన్ చేసి చెప్పాడు. ఇప్పటికే పలుమార్లు సీబీఐ అధికారులు బాలకృష్ణారెడ్డిని ప్రశ్నించారు. రెండ్రోజుల క్రితం.. జమ్మలమడుగుకు చెందిన సాక్షి పత్రిక, టీవీ విలేకరుల నుంచి సమాచారం రాబట్టారు.
సీబీఐ విచారణకు ఉదయ్ కుమార్ రెడ్డి
పులివెందులకు చెందిన ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ ప్రశ్నించింది. యురేనియం కర్మాగారంలో పని చేస్తున్న ఉదయ్‌కుమార్‌రెడ్డి గురించి.. రెండ్రోజుల క్రితమే కర్మాగారం వెళ్లిన సీబీఐ అధికారులు.. ఉదయ్ గురించి ఆరా తీశారు. వివేకా మృతదేహానికి ఉదయ్ తండ్రి ప్రకాశ్‌రెడ్డి కుట్లు వేశారని సీబీఐ అభియోగం మోపింది. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు ఉదయ్‌కుమార్‌రెడ్డిని ప్రశ్నించింది. మరోవైపు ఇదే కేసులో డా. మధుసూదన్‌రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఈయన పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో పని చేస్తున్నారు.