కడప వైకాపా కార్యాలయంలో 71వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి జెండా ఎగరవేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కడపలోని జెమ్స్ పాఠశాల విద్యార్థులు పొడవైన జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. పలువురు జాతీయ నేతల వేషధారణలో జాతీయ జెండాలతో ర్యాలీ చేయడం ప్రజలను ఆకట్టుకుంది.
కడప పరేడ్ గ్రౌండ్ మైదానంలో 71వ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అన్బురాజన్, జేసీ గౌతమి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు చేసిన ప్రదర్శనలు అలరించాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, విన్యాసాలు అక్కడున్న వారిని మంత్రముగ్ధుల్ని చేశాయి.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా మైదుకూరులో భారీ జాతీయ పతాకంతో ప్రదర్శన నిర్వహించారు. పురపాలక కమిషనర్ పీవీ రామకృష్ణ ఆధ్వర్యంలో పురవీధుల్లో ప్రదర్శన సాగింది. బద్వేలులో 71వ గణతంత్ర వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. రాచపూడి నాగభూషణం డిగ్రీ కళాశాల విద్యార్థులు రక్తదానం చేశారు.
రైల్వేకోడూరు మండలం రాఘవపురంలోని జామియా మరకతుల్ ఫల మదర్సాలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ముస్లిం విద్యార్థులు దేశభక్తి పాటలు పాడి అందరినీ అలరించారు.