BTech Ravi Custody Petition Rejected : తెలుగుదేశం నేత బీటెక్ రవిని పోలీసు కస్టడీకి ఇవ్వాలనే పిటిషన్‌ను కడప కోర్టు కొట్టివేసింది. ఈ ఏడాది జనవరి 25న నారా లోకేశ్ కడప విమానాశ్రయానికి వచ్చిన సందర్భంలో.. ప్రధాన గేటు వద్ద పోలీసులకు, బీటెక్ రవికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రవి పోలీసులతో దురుసుగా ప్రవర్తించారనే ఉద్దేశంతో.. అతనిపై వల్లూరు పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఘటన జరిగిన పది నెలల తర్వాత.. అది చిన్న ఘటనకు ఈనెల 14న పోలీసులు అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. దీంతో 14 రోజుల రిమాండు విధించారు. ఈ ఘటనలో బీటెక్ రవిని లోతుగా విచారణ చేయాలంటే.. ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు కడప కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను కడప కోర్టు కొట్టి వేసింది. బీటెక్ రవి బెయిలు కోసం పిటిషన్ వేయగా.. కడప కోర్టు విచారణను ఈనెల 21వ తేదీకి వాయిదా వేసింది.
"కడపలో రాజకీయంగా పునాదులు కదులుతున్నాయనే బీటెక్ రవిని అక్రమంగా అరెస్టు చేయించారు"
BTech Ravi Arrest అరెస్టు ఇలా : పులివెందుల నుంచి కడపకు వస్తున్న బీటెక్ రవిని.. యోగి వేమన విశ్వవిద్యాలయం వద్ద వల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వల్లూరు పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లిన కాసేపటి తర్వాత కడప రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడి నుంచి అర్ధరాత్రి కడప మెజిస్ట్రేట్ భార్గవి ఇంటి వద్దకు తీసుకెళ్లి.. బీటెక్ రవిని హాజరు పరిచారు. ఎఫ్ఐఆర్ కాపీని రిమాండ్ రిపోర్టును అప్పటికప్పుడు బీటెక్ రవికి చూపించారని ఆయన తరపు న్యాయవాదులు జడ్జి ముందు వాదించారు. ఉదయం కోర్టులో ప్రవేశపెట్టాలని రిమాండ్ రిపోర్టును వెనక్కి ఇస్తున్నట్లు మెజిస్ట్రేట్ ముందుగా ఆదేశించారు. కోర్టు ఆదేశాలను బీటెక్ రవి తరపు న్యాయవాది బయటకు వచ్చి మీడియాకు వెల్లడించారు. ఇది జరిగిన పావుగంట తర్వాత మళ్లీ జడ్జి పిలుపు రావడంతో న్యాయవాదులు లోపలికి వెళ్లారు. పోలీసుల అభ్యర్థన మేరకు మరోసారి పరిశీలించిన న్యాయమూర్తి.. బీటెక్ రవికి ఈ నెల 27 తేదీ వరకు 14 రోజులు రిమాండ్ విధించారు. బీటెక్ రవిని కడప కేంద్ర కారాగారానికి తరలించారు.
Opposition Fired on CM Jagan: బీటెక్ రవి అరెస్టు తెలుగుదేశం నేతలు తీవ్రంగా ఖండించారు. సీఎం జగన్ తన ఎన్నికల ప్రత్యర్థి బీటెక్ రవిని చూసి భయపడుతున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. జగన్ తన కక్ష సాధింపులకు పోలీసులను కార్యకర్తల్లా వాడుకుంటున్నారని మండిపడ్డారు. రవి అరెస్టు జగన్ సైకో తత్వానికి నిదర్శనమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. పులివెందులలో ఓడిపోతాననే భయంతోనే జగన్ బీటెక్ రవిని అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఎద్దేవా చేశారు.
బీటెక్ రవికి ఏ చిన్న హాని జరిగినా జగనే పూర్తి బాధ్యత వహించాలి: టీడీపీ
TDP Leaders Arrest: పులివెందులలో జగన్కు బలం తగ్గుతోందనే భయంతోనే సీఎం జగన్ ఈ చర్యకు పూనుకున్నాడని.. ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. జిల్లాలో ఎన్నో ఘోరమైన నేరాలు జరుగుతున్నాయని.. పోలీసులు వాటిపై ఇలా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రతిపక్ష టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీటెక్ రవి మాత్రమే కాకుండా.. కడప జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రవీణ్ కుమార్ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇలా కడప జిల్లాలో టీడీపీ నాయకులను అరెస్టు చేయడాన్ని ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఖండిస్తోంది. కక్షపూరింతగానే వైసీపీ ప్రభుత్వం ఈ చర్యలకు దిగుతోందని ఆరోపిస్తోంది.