All parties protest against DD Acchanna death: జగన్ సర్కార్ హయాంలో దళితులనే కాదు.. దళిత అధికారులను కూడా హత్యలు చేస్తున్నారని అఖిలపక్ష పార్టీ నాయకులు మండిపడ్డారు. అప్పటి డాక్టర్ సుధాకర్ మొదలుకొని ఇప్పటి పశు సంవర్ధకశాఖ డిప్యూటీ డైరెక్టర్ అచ్చన్న వరకు దళితులందరూ జగన్ ప్రభుత్వంలో హత్యకు గురవుతున్నారని ఆరోపించారు. కడప పశు సంవర్ధకశాఖ డిప్యూటీ డైరెక్టర్గా పని చేస్తున్న అచ్చన్న మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కడప పశుసంవర్ధక శాఖ కార్యాలయం ఎదుట అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
చేతిలో ప్లకార్డులు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈనెల 12వ తేదీ నుంచి అచ్చన్న కనిపించకుండాపోయాడు. 14వ తేదీన అచ్చన్న కుటుంబ సభ్యులు కడప ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కానీ పోలీసులు ఈ ఘటనపై నిర్లక్ష్యం వహించడంతో 24వ తేదీ అచ్చన్న గువ్వలచెరువు ఘాట్ రోడ్లో శవమై కనిపించాడని వారు ఆరోపించారు.
గత ఆరు నెలల నుంచి పశుసంవర్ధక శాఖలో అచ్చన్నకు మిగిలిన వైద్యులకు మధ్య మనస్పర్ధలు జరుగుతున్నాయి. కానీ ఏ ఒక్క అధికారి కూడా ఈ సమస్యను పరిష్కరించలేదు, దీంతో చివరకు ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యాయని ఆరోపించారు. అచ్చన్న మృతిపై అటు జిల్లా స్థాయి అధికారులు, పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఒక దళితుడు అదృశ్యమైతే హత్య కేసుగా నమోదు చేయాలనే ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమని ఖండించారు.
అచ్చన్న మృతిపై సమగ్రమైన విచారణ చేపట్టి దోషులు ఎవరైనా సరే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అచ్చన్నది ఆత్మహత్య చేసుకునే మనస్తత్వం కాదని.. ఆయన గత ఆరు నెలల నుంచి జిల్లా స్థాయి అధికారులతో.. చివరికి హైకోర్టుతో కూడా పోరాటం చేస్తున్నాడని చెప్పారు. అచ్చన్న విధుల పట్ల చిత్తశుద్ధితో ఉంటారు.. అది కింది స్థాయి సిబ్బందికి మింగుడు పడడం లేదని పేర్కొన్నారు. దోషులను కఠినంగా శిక్షించకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారి హత్యకు గురికావటం దారుణమని ఖండించారు.
" కడప పశు సంవర్ధకశాఖలో పని చేస్తున్న డీడీ అచ్చన్న హత్యపై న్యాయ విచారణ జరిపించాలని అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నేతృత్వంలో ఈ రోజు మేము నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాము. గత పది రోజుల క్రితం అచ్చన్న అదృశ్యమైపోయినట్లు ఆయన కుమారుడు చక్రవర్తి ఫిర్యాదు చేయటం జరిగింది. అయితే పది రోజుల తర్వాత రామాపురం గువ్వల చెరువు ఘాట్లో ఆయన శవమై కనిపించటాన్ని పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారానికి ముందు ఆరు నెలలుగా డీడీ అచ్చన్న కింద పనిచేస్తున్న కొంతమందితో విభేదాలు ఉన్నట్లు.. ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సమస్యను పరిష్కరించటంలో అధికారులంతా విఫలమయ్యారు. రాష్ట్రంలో ప్రధానంగా బడుగు బలహీన వర్గాలను టార్గెట్గా చేసుకుని ప్రభుత్వం చేస్తున్న హింసాత్మకమైన దాడులు.. ఉద్యోగ వర్గాలను కూడా వదలట్లేదు. అందుకు డీడీ అచ్చన్న హత్యే నిదర్శనం." - చంద్ర, సీపీఐ జిల్లా కార్యదర్శి