ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో అభివృద్ధి పనుల్లో భాగంగా జరిపిన తవ్వకాల్లో రెండు నేలమాళిగలు బయటపడ్డాయి. పొక్లెయిన్ సహాయంతో తవ్వుతుండగా బుధవారం రెండు భారీ గోతులను అక్కడి సిబ్బంది గుర్తించి పురవాస్తుశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. జుమ్మా మసీదు ఎదురుగా ఉన్న ఎర్ర కోనేరు పాక్షికంగా దెబ్బతింది. కోనేరు వద్ద నెల రోజులుగా పురావస్తుశాఖ అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. కోనేరు చుట్టూ బండల పరుపు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా కోనేరు దక్షిణ భాగంలో పొక్లెయిన్‌తో చదును చేస్తుండగా రెండు భారీ భూగర్భ నిర్మాణాలను కనుగొన్నారు.
సుమారు ఎనిమిది అడుగుల లోతు, ఎనిమిది అడుగుల పొడవు, ఆరు అడుగుల వెడల్పుతో నిర్మాణాలు ఉన్నాయి. చతురస్ర ఆకారంలో ఉన్న ఈ నిర్మాణం చుట్టూ పెద్దపెద్ద రాళ్లను అమర్చారు. గండికోట రాజులు పరిపాలించే సమయంలో ఇలాంటి నేలమాళిగలు ఏర్పాటు చేసుకుని బంగారు, వెండి, వజ్రాలు వంటి విలువైన వస్తువులను దాచుకునేవారని ప్రచారంలో ఉండేది. నేలమాళిగలు అంటే భూమిలో విలువైన వస్తువులు దాచుకునే ప్రాంతంగా నేటికీ ప్రచారంలో ఉంది. గురువారం పురావస్తుశాఖ అధికారుల సమక్షంలో మరిన్ని తవ్వకాలు జరపనున్నట్లు తెలిసింది. కోనేరు సమీపంలో ఇలాంటివి రెండేనా మరిన్ని ఉన్నాయా అనే కోణంలో తవ్వకాలు జరిపే అవకాశముంది.
ఇదీ చూడండి ఐదు రోజుల్లోనే నిందితుడ్ని పట్టుకున్న పోలీసులు... అసలేం చేశాడంటే!