పశ్చిమగోదావరిజిల్లా లింగాపాలెం మండలం కలరాయనగూడెం గ్రామ కార్యదర్శిని వైకాపా నాయకులు తన కార్యాలయంలో నిర్బంధించి, దాడిచేయడానికి ప్రయత్నించారు.
గ్రామకార్యదర్శి నాగతిరుమల రాజా విధుల్లో ఉండగా.. వైకాపా నాయకుడు, గ్రామ సర్పంచ్ సోదరులు.. కార్యాలయానికి తాళం వేసి నిర్బంధించారు. దాడికి పాల్పడుతూ.. బెదిరింపులకు దిగారు. భయపడిన గ్రామ కార్యదర్శి ధర్మజీగూడెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సర్పంచ్ అక్రమాలకు తోడ్పాటు అందించలేదని దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన వైకాపా పెద్దలు ఇద్దరి మధ్య రాజీ చేసి..పోలీసు కేసు లేకుండా చేశారు.
అనంతపురంలో..
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని కోట వార్డు సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న మౌలిక సదుపాయాల కార్యదర్శి చింతా రామాంజనేయులు అనే ఉద్యోగిపై స్థానిక వైకాపా నాయకుడు తొండమాల రవి దాడి చేశాడు.
వార్డులో గతంలో నిర్మించిన పాత ఇంటికి బిల్లు మంజూరు చేయాలని, తన ఇంటి వద్దకు రామాంజనేయులును తొండ మాల రవి పిలిపించారు. చర్చల అనంతరం పాత ఇంటికి బిల్లు మంజూరు చేసేందుకు రామాంజనేయులు నిరాకరించడంతో రవి దాడి చేశాడు.
సచివాలయ ఉద్యోగులు రామాంజనేయులుతో కలసి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఉద్యోగ వర్గాల్లో భయాందోళన రేకెత్తించింది. జిల్లా ఉన్నతాధికారులు జరిగిన ఘటనపై ఆరా తీసి నివేదిక పంపాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.
ఇదీ చదవండి: వైకాపా ఎమ్మెల్యే తీరుపై భాజపా వినూత్న నిరసన.. బర్తరఫ్కు డిమాండ్