పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ప్రపంచ కోడిగుడ్డు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా పౌల్ట్రీ ఫెడరేషన్, పౌల్ట్రీ ఫార్మర్స్ అసోసియేషన్, నెక్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. పౌల్ట్రీ రంగం పితామహుడు బీవీ రావు, ఉత్తరా దేవీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పౌల్ట్రీ రంగాన్ని వెలుగులోనికి తీసుకొచ్చి రైతులకు మార్గదర్శిగా నిలిచారని పలువురు కొనియాడారు.
కోడిగుడ్డు ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి తెలియజేయడమే కోడిగుడ్డు దినోత్సవ నిర్వహణ ముఖ్య ఉద్దేశం అని అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోమట్ల పల్లి వెంకట సుబ్బారావు అన్నారు. కరోనా కారణంగా గుడ్ల వినియోగం పెరిగినప్పటికీ ఉత్పత్తి తక్కువగా ఉందని తెలిపారు. అయితే ప్రజల అవసరాలకు తగ్గట్లుగా గుడ్లను అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
వివిధ దేశాల్లో ఒక మనిషి ఏడాదికి 300 నుంచి 320 గుడ్లను వినియోగిస్తే మనదేశంలో 60 మాత్రమే ఉందని అన్నారు. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి పోషక విలువలు కలిగిన కోడిగుడ్డును ఎక్కువగా వినియోగించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అనంతరం వివిధ పాఠశాలల్లో విద్యార్థులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు గుడ్లు పంపిణీ చేశారు.
ఇదీ చూడండి: