పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం కొమ్మర గ్రామంలో దారుణం జరిగింది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ భార్య కట్టుకున్న భర్తనే ప్రియునితో కలిసి హత్య చేయించింది. కొమ్మర గ్రామానికి చెందిన సిర్రా శాంతారావు, ధనలక్ష్మి భార్యాభర్తలు. వీరికి ఓ కుమారుడు. పది నెలల క్రితం వీరి మధ్య విభేదాలు రావడం వల్ల భర్త నుంచి ధనలక్ష్మి విడిపోయి మంచిలి గ్రామానికి వెళ్లిపోయింది. అక్కడ స్థానికంగా ఉంటున్న అయ్యప్ప అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ నేపథ్యంలో భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది. వెంటనే ప్రియుడి అయ్యప్పతో కలిసి శాంతారావు హత్యకు ప్రణాళిక వేసుకుంది. అయ్యప్ప.. శాంతారావుతో స్నేహాన్ని కొనసాగించాడు. ఈ నెల 9న అయ్యప్ప...తన స్నేహితుడు రమేష్‌తో కలిసి శాంతారావుకు అధిక మోతాదులో మద్యం తాగించాడు. అనంతరం మద్యం మత్తులో ఉన్న శాంతారావును ముప్పర్తిపాడు రహదారి వద్ద కాలువలోని నీటిలో ముంచేశారు. శాంతారావు ఊపిరాడక చనిపోయాడు. శవాన్ని గుర్తించిన కొంతమంది వ్యక్తులు పోలీసులకు సమాచారమిచ్చారు. హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు ధనలక్ష్మితో పాటు అయ్యప్ప, రమేష్‌ను గణపవరం ఎస్ఐ వీరబాబు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
ఇవీ చదవండి: