పశ్చిమగోదావరి జిల్లాలో ఈ నెల 9న తొలి దశ ఎన్నికలు జరిగే నరసాపురం డివిజన్ పరిధిలో 12 మండలాల్లో పక్కా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ రేవు ముత్యాలరాజు వివరించారు. మిగిలిన మూడు డివిజన్లలోనూ సమాంతరంగా ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఈటీవీ భారత్: ప్రస్తుతం జిల్లాలో కొనసాగుతున్న కరోనా టీకా వేసే ప్రక్రియ, ఎన్నికల నిర్వహణను ఎలా సమన్వయం చేస్తున్నారు?
కలెక్టర్: కరోనా టీకా ప్రక్రియ వల్ల ఎన్నికలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశాం. ఎన్నికలకు ఎక్కువ మంది సిబ్బంది అవసరం. అందులో అధికశాతం ఉపాధ్యాయులే. వీరికి ఇంకా టీకా వేయలేదు. కనుక వీరు ఎన్నికల్లో పాల్గొనే సమయంలో కరోనా నివారణ చర్యలు తీసుకుంటున్నాం. పోలింగ్ కేంద్రాల్లో సక్రమంగా పారిశుద్ధ్యం ఉండేలా, భౌతిక దూరం పాటించేలా, మాస్క్, శానిటైజర్లు, పీపీఈ కిట్లు ఉండేలా ఏర్పాట్లు చేశాం.
ఈటీవీ భారత్: నామినేషన్ ప్రక్రియలో అవసరమైన కుల ధ్రువ పత్రం మంజూరులో కొన్ని చోట్ల జాప్యం జరుగుతుందనే ఫిర్యాదులు వస్తున్నాయి.
కలెక్టర్: సమస్యలు రాకుండా తహసీల్దార్లు కార్యాలయంలో అందుబాటులో ఉండాలని, పత్రాల జారీలో జాప్యం చేయొద్దని ఆదేశాలిచ్చాం. సమయానికి అందని పక్షంలో నామినేషన్ మూడో భాగంలో (పార్ట్-3) తహసీల్దారు సంతకం చేసినా సరిపోతుంది. నామినేషన్ కోసం కులధ్రువ పత్రం కావాల్సిన వారికి మీసేవకి కూడా వెళ్లాల్సిన అవసరం లేకుండా మాన్యువల్‌గా కూడా ఇవ్వాలని ఆదేశించాం. జిల్లాలో కులధ్రువ పత్రాల మంజూరు ఆలస్యానికి తావే లేదు.
ఈటీవీ భారత్: గ్రామ వాలంటీర్లను ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో చాలా ప్రాంతాల్లో వీరు రహస్యంగా ప్రచారం చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై మీ స్పందన?
కలెక్టర్: ఎన్నికల పనుల్లో పాల్గొనకూడదు. ప్రచారంలో, పార్టీలకు మద్దతుగా పాల్గొనడం నిబంధనలకు విరుద్ధం. దీనిపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం. ఇప్పటి వరకూ వారు ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు ఎలాంటి ఫిర్యాదులూ రాలేదు. భేఖాతరు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. వాలంటీర్ల ఫోన్లు స్వాధీనం చేసుకోవాలని అధికారికంగా ఎలాంటి ఆదేశాలూ రాలేదు. సామాజిక మాధ్యమాల్లో తప్పుగా ప్రచారం చేస్తున్నారు.
ఈటీవీ భారత్: జిల్లాలో ఉన్న సరిహద్దుల నుంచి ఎన్నికల నేపథ్యంలో మద్యం, నగదు రవాణా జరుగుతోందనే ప్రచారం సాగుతోంది. అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.?
కలెక్టర్: జిల్లాలో మండలానికి ఒక బృందం చొప్పున 48 ఎస్‌ఎస్‌టీ (స్టాటిక్ సర్వేలెన్స్ టీం)లను ఏర్పాటు చేశాం. గతంలో మద్యం, నగదు పట్టుబడిన ప్రాంతాలను గుర్తించి అక్కడ కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశాం. జిల్లా, రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్ఠమైన నిఘా ఉంటుంది. సాధారణ ప్రజలు రూ.50వేల కంటే ఎక్కువ మొత్తం నగదు రవాణా చేస్తే సంబంధిత పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. ఎన్నికల్లో ప్రచారం చేసే అభ్యర్థులైతే రూ.10వేలు దాటి ఉండకూడదు. మద్యం, ఆయుధాలు రవాణా చేస్తున్నా స్వాధీనం చేసుకుంటారు.
ఈటీవీ భారత్: జిల్లాలో బెదిరింపులు, బలవంతపు ఏకగ్రీవాలు జరగకుండా తీసుకుంటున్న చర్యలు ఏమిటి?
కలెక్టర్: అభ్యర్థులను బెదిరించటం, ప్రలోభాలకు గురిచేయటం, బలవంతంగా ఏకగ్రీవాలు చేయటం వంటి కార్యక్రమాలు జరగకుండా షాడో బృందాలను ఏర్పాటు చేశాం. ఈ బృందాల్లో మండల ప్రత్యేక అధికారులు, పోలీసులు ఉంటారు. ఈ తరహా ఫిర్యాదులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తారు. నిరూపణ అయితే కేసులు నమోదు చేస్తారు. దీంతో పాటు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్‌కి వచ్చిన ఫిర్యాదులు కూడా స్వీకరిస్తాం. ఇప్పటి వరకూ 20 ఫిర్యాదులు రాగా.. వాటిపై నివేదికలు తీసుకుంటున్నాం.
ఇదీ చదవండి: కొప్పర్రులో 'ఈ ఇంటి ఓట్లు అమ్మబడవు' ఉద్యమం..!