పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 82.76 శాతం పోలింగ్ నమోదైంది. మొదటి రెండు విడతల కంటే ప్రస్తుతం ఎక్కువ మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. అత్యధికంగా లింగపాలెం మండలంలో 87.51 శాతం, అత్యల్పంగా బుట్టాయగూడెంలో 74.94 శాతం పోలింగ్ నమోదయింది.
చింతలపూడి పరిధిలోని ప్రగడవరం, లింగపాలెం పరిధిలోని ధర్మాజీగూడెం పోలింగ్ కేంద్రాల్లో శానిటైజర్లున్నా అధికారులు వినియోగించలేదు. అక్కడ థర్మల్ స్క్రీనింగ్ పరికరాలు అందుబాటులో లేవు.
చాలా పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్ధులకు సరిపడా చక్రాల కుర్చీలు అందుబాటులో లేవు. ఉన్నవి సక్రమంగా పని చేయలేదు.
జంగారెడ్డిగూడెం మండలం దేవుళ్లపల్లిలో స్థల సమస్యతో వరండాలో రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
కామవరపుకోట, టి.నరసాపురం పరిధిలోని కొన్ని కేంద్రాల్లో ఓటు వేసేందుకు చాలా మందికి స్లిప్‌లు అందక ఇబ్బందిపడ్డారు.
ఓట్లు వేసేందుకు పాట్లు
కొయ్యలగూడెంలో అధికారులు పోలింగ్ వార్డులను తారుమారుగా నమోదు చేయడంతో కొయ్యలగూడెం మండలం బోడిగూడెం పంచాయతీలోని పలు వార్డులకు చెందిన ఓటర్లు అవస్థలు పడ్డారు. పంచాయతీలోని అంకాలగూడెంలో 1 నుంచి 5 వార్డులకు మూడు కిలోమీటర్ల దూరంలోని బోడిగూడెంలో; బర్కిట్‌నగర్, బోడిగూడేలకు చెందిన 9 నుంచి 14 వార్డులకు అంకాలగూడెంలో పోలింగ్ కేంద్రాలను కేటాయించారు. బర్కిట్‌నగర్ ఓటర్లు ఐదు కిలోమీటర్లు ఆటోలు, సొంత వాహనాల్లో ప్రయాణించి అంకాలగూడెంలో ఓటు వేశారు. వార్డులు తారుమారైన విషయం అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని స్థానికులు వాపోయారు.
ఆ మూడు గంటల్లోనే..
ఉదయం 6.30 గంటలకే పోలింగ్ ప్రారంభమైనా చాలా మండలాల్లో మొదట మందకొడిగా సాగింది. 9 నుంచి 12 గంటల మధ్య ఓటర్ల సంఖ్య తారస్థాయికి చేరింది. లింగపాలెం, చింతలపూడి, జంగారెడ్డిగూడెం పరిధిలో ఉదయం నుంచి పోలింగ్ వేగంగా జరిగింది. కొన్ని చిన్న పంచాయతీల్లో మధ్యాహ్నం 11 గంటల్లోపే ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. పెద్ద పంచాయతీల్లో మధ్యాహ్నం 2 గంటల తర్వాత పోలింగ్ కేంద్రాలు ఖాళీగా దర్శనమిచ్చాయి.
ఏలూరు, జంగారెడ్డిగూడెం, కుక్కునూరు డివిజన్లలో 11 మండలాల పరిధిలోని 163 పంచాయతీలు, 1,519 వార్డుల్లో బుధవారం ఎన్నికలు జరిగాయి. మొత్తం 177 పంచాయతీలకు 14 ఏకగ్రీవం అయ్యాయి. 4,14,630 మంది ఓటర్లకు 3,43,138 మంది ఓటు వేశారు.
ఇదీ చదవండి