Untimely Rains Damage Tobacco: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఐదు కేంద్రాల్లో పొగాకు వేలం కొనసాగుతోంది. అయితే పొగాకు ధరలు పతనం కావడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్చి 28న పొగాకు వేలం మొదలు కాగా తొలుత మొటి రకం కిలోకు అత్యధిక ధర రూ.195 చొప్పున ఇచ్చిన కంపెనీలు మూడో రోజు నుంచి ధరల తగ్గింపు ప్రారంభించాయి. వారం రోజుల్లోనే కిలోకు రూ.10 నుంచి 20 వరకు తగ్గించేశాయి. ఈ పరిణామంతో రైతులు ఆందోళన విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇక రెండో రకం, తక్కువ గ్రేడు రకాల ధరలు మరింత తగ్గాయి. ఇలా అయితే తీవ్రంగా నష్టపోతామని రైతులు వాపోతున్నారు.
రైతులకు అడియాశే : ఈ ఏడాది పొగాకు ధరలపై రైతులంతా ఆశలు పెట్టుకోగా వేలం కేంద్రంలోని ధరలు నిరాశాజనకంగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి పంటలకు పెట్టుబడులు పెరగడం, ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పొగాకు పంటలు బాగా దెబ్బతిన్నాయి. అకాల వర్షాల కారణంగా నాణ్యమైన పొగాకు తక్కువగా రావడంతో మద్దతు ధరపైనే ఆశలు పెట్టుకున్న రైతులకు అడియాశే మిగిలింది. ఎరువులు, పురుగు మందుల ధరలు పెరగడం, కూలీలు, క్యూరింగ్ ఖర్చులు సైతం ఈ ఏడాది భారీగా పెరిగిన నేపథ్యంలో కిలోకు కనీసం 250 రూపాయలు ఇస్తే కానీ కోలుకునే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు.
చిన్న చూపు చూస్తున్న ప్రభుత్వం : బ్యారన్ లైసెన్స్ కలిగి ఉన్న రైతులు వాటిని వదులుకోవడం ఇష్టం లేక పెట్టుబడులు ఎక్కువైనా పొగాకు సాగు చేస్తున్నారు. ఏటా పంట సాగు చేసి మద్దతు ధర కోసం ఎదురుచూడటం రైతులు ఆశించిన ధర రాకపోవడంతో నిరాశకు గురికావడం పరిపాటిగా మారింది. అందుకు తోడు ఈ సారి కురిసిన అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎకరాకు రూ.80 వేల నుంచి రూ. లక్ష వరకు పెట్టుబడులు పెట్టిన రైతులకు ఆదాయం మాట అటుంచితే పెట్టుబడులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పొగాకు సాగు ఖర్చుతో కూడుకున్నది కావడం, వర్షాలు వచ్చినప్పుడు నష్టపోయిన పంటలకు పరిహారం అందించడంలోనూ ప్రభుత్వం చిన్న చూపు చూస్తున్నాయని రైతులు వాపోతున్నారు. తాము పెట్టుబడులు పెట్టిన దానికి ప్రస్తుతం వేలంలో అందుతున్న ధరకు పొంతనలేదని కిలోకు ఈ సారి ఎంత ఇచ్చినా తక్కువేనని రైతులు స్పష్టం చేస్తున్నారు.
ఆత్మహత్యలే శరణ్యం : అకాల వర్షాలతో నిండా మునిగిన తమకు ఇప్పటికీ పరిహారం అందలేదని కనీసం మద్దతు ధర అయినా ఇచ్చి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. లేదంటే తమకు ఆత్మహత్యలే శరణ్యమని అన్నదాతలు వాపోతున్నారు.
"అకాల వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయాం. గతంలో ఉన్న ధర కంటే ప్రస్తుతం తక్కువ ధరకే పొగాకు కొంటున్నారని మా అభిప్రాయం. మేము పెట్టుబడి పెట్టిన దానికి కిలోకు 250 రూపాయల పైన ఇస్తేనే గిట్టుబాటు అవుతుంది. పొగాకుకు గిట్టుబాటు ధర లేకపోతే రైతులం అప్పుల నుంచి కోలుకునే పరిస్థితి లేదు."- పొగాకు రైతులు
ఇవీ చదవండి