పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా వైరస్ ప్రభావం డెల్టా ఆధునికీకరణ పనులపై పడింది. కిందటి సంవత్సరం ఎన్నికల కారణంగా పనులు వాయిదా పడ్డాయి.. ఇప్పుడు కరోనా వల్ల ఆగిపోయింది. నరసాపురం కాలువపై జిన్నూరు వద్ద అప్రోచ్.. రహదారి నిర్మించాల్సిన వంతెన పనులు మరుగునపడ్డాయి.
పశ్చిమ డెల్టాలో పంట కాలువలకు రూ.161 కోట్లు ఖర్చు కాగల, 113 పనులు, మురుగు కాలువలకు రూ.100 కోట్ల పనులు ప్రతిపాదించి ప్రభుత్వానికి పంపించారు. కాలువలు కట్టివేసిన వెంటనే పనులు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ప్రతిపాదనల సమయంలో జలవనరుల శాఖాధికారులు తెలిపారు.
టెండర్లు పిలవటం, ఖరారైన పనులకు గుత్తేదారునికి పని ఉత్తర్వులు ఇవ్వడం వంటి ప్రక్రియ జనవరి నెలాఖరులోపే పూర్తి కావాలి. ఈ విషయంలో ప్రతిపాదనలు తప్ప మరో అడుగు ముందుకు పడలేదు.
కాలువల కట్టివేత గడువు పెంపు?
పశ్చిమ డెల్టాలో కాలువల కట్టివేత గడువు పెంచాలనే దిశగా యంత్రాంగం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ముందుగా అనుకున్న ప్రకారం ఈ నెల 10న కాలువలు కట్టేయాలి. అయితే సాగు, తాగు నీటి అవసరాలు తీరలేదు. దాళ్వా పంట చేతికొచ్చే చివరి దశలో ఉంది. ముందుగా నాట్లు వేసిన ప్రాంతాల్లో వారం పది రోజుల్లో మాసూళ్లు జరుగనున్నాయి. మిగిలినవి మరో పదిహేను రోజుల వరకు ఆలస్యమయ్యేలా ఉంది.
అనుమతులు ఇంకా రాలేదు..
వేసవిలో చేపట్టాల్సిన కాలువల పనులకు ప్రభుత్వం నుంచి అనుమతులు ఇంకా రాలేదని జలవనరులశాఖ అధికారి తెలిపారు. కాలువలను కట్టివేసే సమయం తక్కువగా ఉన్నందున ఈసారి పనులు జరిగేలా లేవని జలవనరులశాఖ,ఈఈ, దక్షిణామూర్తి అన్నారు. రైతాంగానికి ఇబ్బంది లేకుండా ఓ అండ్ ఎం నిధులతోనే అత్యవసర పనులు చేపడతామని... ఈ నెల 10న కాలువలను మూసివేయాలని తొలుత నిర్ణయించాంమని పేర్కొన్నారు. దాళ్వా వరిసాగుకు సంబంధించి నీటి అవసరాలపై వ్యవసాయ శాఖను నివేదిక కోరామని తెలిపారు. ఆ వివరాలు రాగానే కలెక్టర్ దృష్టికి తీసుకెళతాంమని.. గడువు పెంపుపై ఆయన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.