పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురం, రుస్తుంబాధలో శ్రీ గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 25వ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు ముగిశాయి. ఈ పోటీలు ఐదు రోజులుగా సాగాయి. ఈ సందర్భంగా విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు హాజరయ్యారు. ప్రభుత్వ సాయం లేకుండా 25 ఏళ్లుగా కబడ్డీ పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. క్రీడలతో శారీరక, మానసిక వికాసం పెంపొందుతుందని తెలిపారు.
ఆటల వలన పట్టుదల, లక్ష్యం చేరుకోవాలనే తప్పన, పోటీతత్వం పెంపొందుతుందని సబ్ కలెక్టర్ కేఎస్ విశ్వనాథన్ పేర్కొన్నారు. క్రీడల్లో గెలుపోటములను సమానంగా చూడాలని సంయుక్త కలెక్టర్ హిమన్షూ శుక్లా అన్నారు. ఆలాగే పండుగ సమయంలో యువత చెడు వ్యసనాలకు లోను కాకుండా ఉండేెందుకు ఈ పోటీలు దోహదపడుతాయని ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు అన్నారు.
ఐదు రోజుల పాటు సాగిన పోటీల్లో పురుషుల విభాగంలో చంఢీఘడ్, పశ్చిమ బంగాల్, దిల్లీ, పుదుచ్చేరి జట్లు తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి. మహిళా విభాగంలో ఉత్తర ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమ బంగాల్, పుదుచ్చేరి జట్లు గెలుపొందాయి. విజయం సాధించిన టీంలకు వరుసగా లక్ష రూపాయలు, రూ. 75 వేలు, రూ. 50 వేలు, రూ. 25 వేల చొప్పున నగదు, జ్ఞాపికలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంబీసీ చైర్మన్ పెండ్ర వీరన్న, జాన్ కెన్నెడీ ఏఎంసీ చైర్మన్, పురపాలక కమిషనర్ పీఎం సత్యవేణి, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్, ఏపీ కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీ, ఉత్సవ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: టిడ్కో ఇళ్ల పట్టాల పంపిణీలో ప్రోటోకాల్ వివాదం