TDP leaders Adireddy Vasu and Apparao released from Central Jail: తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాసులు ఈరోజు సాయంత్రం బెయిల్‌పై రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి ఆదిరెడ్డి వాసు, అప్పారావులు విడుదలకానున్న సందర్భంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున జైలు వద్దకు చేరుకుని.. జై తెలుగుదేశం మంటూ నినాదాలు చేశారు. అనంతరం జైలు నుంచి విడుదలైన ఆదిరెడ్డి, అప్పారావులకు ఘన స్వాగతం పలికారు.
14 రోజుల రిమాండ్ విధింపు.. జగజ్జనని చిట్ ఫండ్ సంస్థలో అక్రమాలు జరిగాయంటూ ఈ నెల 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులైన ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాసులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని జిల్లా న్యాయస్థానం హాజరుపర్చగా.. 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వారిద్దరిని సీఐడీ అధికారులు రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిన్న వారికి బెయిల్ మంజూరు ఈరోజు సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యారు.
ఎదిరించే శక్తి లేక వివిధ కేసుల్లో ఇరికించారు.. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకుని వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం జై తెలుగుదేశం మంటూ నినాదాలు చేస్తూ.. ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఆదిరెడ్డి ఇంటి వద్ద ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న తమను ఎదిరించే శక్తి లేక వివిధ కేసుల్లో ఇరికించారని అన్నారు.
ఆ అధికారులపై కేసులు పెడతాం.. అనంతరం ఈ కేసులో సాక్ష్యాలు ఏవని సాక్షాత్తు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించిందని గుర్తు చేశారు. సీఎం చుట్టూ ఉన్న సీనియర్లు కూడా అక్రమ కేసుల గురించి మాట్లాడటం లేదని ఆగ్రహంచారు. ఆదిరెడ్డి కుటుంబంపై సీఐడీ తప్పులు కేసులు పెట్టిందన్న ఆయన.. అధికారులపై కేసులు పెడతామని పేర్కొన్నారు. అకాల వర్షాలతో 54 నియోజకవర్గాల్లో రైతులు పంట నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. వ్యవసాయ శాఖ మంత్రి 15 రోజులు బయటకు రాలేదని.. అటువంటి మంత్రి గురించి మాట్లాడితే.. తమను తాము అవమానించుకోవడమేనని అచ్చన్నాయుడు అసహనం వ్యక్తం చేశారు.
''మా గొంతులను నొక్కడానికి జగన్ ప్రభుత్వం ఎక్కడికక్కడ అక్రమ కేసులు పెట్టిస్తోంది. సైకో జగన్ అతనితో ఉండే కొందరు సలహాదారుల వల్ల రాష్ట్రం బ్రష్టుపట్టిపోయింది. తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తే భయపెడతామా..?. టీడీపీ మా బీసీలకు, బలహీన వర్గాలకు లైఫ్ ఇచ్చింది. బీసీ సంక్షేమానికి పాటుపడింది. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. రేపు టీడీపీ అధికారంలోకి వస్తే చట్టబద్ధంగా ముందుకెళ్తాం.''-అచ్చెన్నాయుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు
ఇవీ చదవండి