తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంతోపాటు వివిధ ప్రాంతాల్లో దాడులను నిరసిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా తెదేపా బంద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో.. పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనలతో హోరెత్తించారు. వైకాపా దౌర్జన్యం నశించాలని నినదించారు. అయితే.. పోలీసులు పలుచోట్ల ముందస్తు అరెస్టులు చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గృహ నిర్బంధంలో ఉన్న నిమ్మల బయటికి రావడానికి ప్రయత్నించారు. కానీ.. అక్కడే ఉన్న పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. రామానాయుడు గేటు తోసుకుని బలవంతంగా బయటకు రావడానికి ప్రయత్నించడంతో.. ఉద్రిక్తత నెలకొంది. కార్యకర్తలు, పోలీసుల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట చోటు చేసుకుంది. దీంతో.. నిమ్మలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. స్టేషన్కు తరలించారు.
ఎక్కడికక్కడ అరెస్టులు..
ఏలూరులో తెదేపా కార్యకర్తలను ఎక్కడివారిని అక్కడే అరెస్టు చేశారు. చాలా మందిని ముందస్తుగానే అరెస్టు చేసి, స్టేషన్లకు తరలించారు. ఏలూరు నగరంలోని ఫైర్ స్టేషన్ సెంటర్, ఆర్ ఆర్ పేట, ఒకటో పట్టణం ప్రాంతాల్లో తేదేపా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి మూడో పట్టణ స్టేషన్ కు తరలించారు. ఏలూరు తేదేపా అధ్యక్షుడు బడేటి చంటిని ఉదయం నుంచి గృహనిర్బంధం చేశారు. పెదవేగి మండలం దుగ్గిరాలలో తెదేపా నాయకుడు చింతమనేని ప్రభాకర్ బయటకు రాకుండా.. పోలీసులు భారీగా మోహరించారు.
జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆందోళన చేస్తున్న తెదేపా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. తెల్లవారుజామునే తెదేపా కార్యకర్తలు, నాయకులు ఆర్టీసీ బస్టాండ్ వద్ద బైఠాయించి బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో.. పోలీసులు వారిని బలవంతంగా స్టేషన్ కు తరలించారు.
ఇదీ చదవండి: YCP Internal Clashes: మంత్రికి సొంత పార్టీ నేత సవాల్.. నియోజకవర్గంలో హైటెన్షన్ !