TDP Leaders Protest on Chandrababu Arrest: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 11వ రోజు సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, రాష్ట్ర ఖాదీ బోర్డు మాజీ చైర్మన్ దొమ్మేటి వెంకట సుధాకర్, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి చంద్రబాబు నాయుడు మాస్కులు ధరించి దీక్షలో పాల్గొన్నారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు.
ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ను అక్రమంగా అరెస్టు చేయించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నాడని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేస్తే 66 లక్షల మంది తెలుగుదేశం కార్యకర్తలు ఒక్కొక్కరు ఒక్కొక్క చంద్రబాబు నాయుడు మాదిరిగా పోరాడుతారని చెప్పారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేందుకు ప్రతి కార్యకర్త, ప్రజలందరూ సంసిద్ధులుగా ఉన్నారని రాధాకృష్ణ అన్నారు.
చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ రాజమండ్రి సెంట్రల్ జైలుకు టీడీపీ నాయకులు, అభిమానులు.. ఆయనకు అండగా ఉంటామని పేర్కొంటూ ఐదువేల పోస్టు కార్డులు పంపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో మాజీ శాసనసభ్యుడు ఐతాభత్తులు ఆనందరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. చంద్రబాబు నాయుడును జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణం శాంతినగర్‌లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీపీడీ పోలీట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది.
దీంతోపాటు అంబేద్కర్ జిల్లాలోని కొత్తపేట నియోజక వర్గం రావులపాలెంలో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. 11వ రోజు నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన రైతులు ఈ దీక్షలో కూర్చున్నారు. అరటి గెలలు, కొబ్బరికాయలు, వరి పనులతో వినూత్నంగా నిరసన తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు పూర్తిగా నష్టపోయారని బండారు అన్నారు.
శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కాల్వ శ్రీనివాసుల ఆమరణ నిరాహార దీక్షకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ ఆమరణ నిరాహార దీక్ష ప్రాంతానికి వేలాదిమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వచ్చి పరామర్శించి వెళ్తున్నారు. నిరాహార దీక్ష శిబిరంలో కాల్వ శ్రీనివాసులు రాత్రి నిద్రపోగా.. తమ అభిమాన నేతకు తోడుగా వందలాదిమంది టీడీపీ నాయకులు వచ్చి అక్కడే నిద్రపోయారు. చంద్రబాబు నాయుడును జైలు నుంచి విడుదల చేసే వరకు తమ పోరాటం ఆగదని టీడీపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు.
చంద్రబాబును అరెస్టును నిరసిస్తూ వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. పార్టీ పట్టణ అధ్యక్షుడు దాసరిబాబు ఆధ్వర్యంలో మున్సిపాలిటీతోపాటు మండలానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొని దీక్షలు చేపట్టారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 'సైకో పోవాలి.. సైకిల్ రావాలి', 'జైబాబు.. జైజై బాబు', చంద్రబాబును వెంటనే విడుదల చేయాలనే డిమాండ్లతో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని తెలుగు మహిళ ఆధ్వర్యంలో భారీ నిరసన రాలి చేపట్టారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి సారధ్యంలో.. ముందుగా మరిడిమాంబ శివాలయం ఆలయాల్లో చంద్రబాబు విడుదలపై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి నల్లజెండాలతో పట్టణంలోని అబీద్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు.
తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఆదరణను చూడలేక వైసీపీ సర్కార్ కుట్రలు చేస్తుందని, దీనిలో భాగంగానే చంద్రబాబును అరెస్టు చేశారని అల్లూరి జిల్లా రంపచోడవరం మాజీ ఎమ్మెల్యేలు పంతల రాజేశ్వరి, సీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నం బాబు రమేశ్ మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టు నిరసిస్తూ రంపచోడవరంలో టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం నాటికి 11వ రోజుకు చేరాయి. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి దీక్షను చేపట్టారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.
చంద్రబాబు అరెస్టుపై చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు శనివారం శ్రీ ధ్యానాభిరామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. వెంటనే విడుదల కావాలని ఆకాంక్షిస్తూ టెంకాయలను కొట్టి స్వామివారిని వేడుకున్నారు. తదనంతరం ఆలయం ఎదుట బైరెడ్డిపల్లి మండల పార్టీ అధ్యక్షుడు కిషోర్ గౌడ్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో గంగవరం మండలం టీడీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు వెంటనే విడుదల కావాలని ఆకాంక్షిస్తూ.. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నోహోబిళం శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో టీడీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ వీర అభిమాని మాళపురం రాధాకృష్ణ ఆధ్వర్యంలో 101 టెంకాయలను కొట్టారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో వెంటనే విడుదల కావాలని దేవుని ప్రార్థిస్తూ ఆలయంలో పొర్లు దండాలు పెట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.