పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో ప్రభుత్వ అధికారులకు, పారిశుద్ధ్య కార్మికులకు మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాస్కులు పంపిణీ చేశారు. భౌతిక దూరం పాటిస్తూ ఆయా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి అధికారులకు మాస్కులు అందజేశారు. తెదేపా అధినేత చంద్రబాబు పిలుపుమేరకు గోపాలపురం నియోజకవర్గంలోని 80 పంచాయతీల్లో నిత్యావసర సరకులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కూలీలు, యాచకులకు అన్నదానం చేస్తున్నట్లు వివరించారు. నియోజకవర్గంలో 2.50 లక్షల మాస్కులు పంపిణీ చేస్తున్నట్లు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు తెదేపా తరఫున ప్రభుత్వానికి తమవంతు సహకారం అందిస్తామని ఆయన తెలిపారు.