అక్టోబర్ నెల మొదటి విడత రేషన్ పంపిణీ శనివారం నుంచి ప్రారంభమైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 12 లక్షల 83 వేల 678 మంది బియ్యం కార్డుదారులకు 2020 దుకాణాల ద్వారా పంపిణీ చేయనున్నారు. వీరికి పంపిణీ చేయడానికి 16900 టన్నుల బియ్యం, 1260 టన్నుల కందిపప్పు అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి జిల్లాలో అందరికీ పంపిణీ చేయడానికి 610 టన్నుల పంచదార అవసరం. 370 టన్నుల పంచదార మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం.
పంచదార సరఫరాకు సంబంధించి హైదరాబాద్కు చెందిన సంస్థతో ఒప్పందం ఆగస్టు నెలలో ముగిసిపోయింది. తిరిగి టెండర్ ప్రక్రియ కొలిక్కి రాకపోవడంతో పంచదార సరఫరా నిలిచిపోయింది. దీంతో గోదాముల్లో నిల్వ ఉన్న పంచదారను రేషన్ డీలర్లకు పంపించారు. పంచదారకు డీడీలు ఇచ్చిన డీలర్లకు మాత్రమే సరఫరా చేయడం విశేషం. జిల్లాలో 2020 మంది డీలర్లు ఉండగా 1257 మంది డీలర్లు మాత్రమే 325 టన్నులకు సరిపడా డీడీలు సమర్పించారు. డీడీలు ఇచ్చిన వారికి మాత్రమే పంచదార సరఫరా చేశామని మరో 45 టన్నుల పంచదార గోదాములో అందుబాటులో ఉందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు వివరించారు. డీడీలు సమర్పిస్తే డీలర్లకు ఆ పంచదార కూడా సరఫరా చేస్తామని చెప్తున్నారు.
ఇదీ చదవండి: వసతుల లేమే శాపం.. మిగిల్చింది గర్భశోకం