దిల్లీ మూలాలున్న వారికే కరోనా ఎక్కువగా సంక్రమిస్తున్న నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అధికారులు ఇప్పటివరకూ దిల్లీ వెళ్లి వచ్చిన 37 మందిని గుర్తించారు. వీరందరినీ రైల్వే రిజర్వేషన్ వివరాల ఆధారంగా పట్టుకున్నారు. రిజర్వేషన్ లేకుండా వివిధ మార్గాల ద్వారా దిల్లీకి వెళ్లి వచ్చిన వారి వివరాలు తెలుసుకోవడం సవాలుగా మారింది. జిల్లా నుంచి దిల్లీ కార్యక్రమానికి మొత్తం 100 మంది వరకూ వెళ్లి ఉంటారని అంచనా వేస్తున్నారు.
37 మందికి సంబంధించిన సుమారు 155 మంది కుటుంబ సభ్యులను క్వారంటైన్ సెంటర్లకు తరలించారు. దిల్లీ నుంచి వచ్చిన 37 మందిలో 14 మందికి పాజిటివ్, ఏడుగురికి నెగిటివ్ వచ్చాయి. మిగిలిన 16 మంది నివేదికలు రావాల్సి ఉంది. నెగిటివ్ వచ్చిన వారిని 14 నుంచి 28 రోజులు క్వారంటైన్ సెంటర్లలో ఉంచుతారు. వీరు ఈ మధ్య కాలంలో ఎవరిని కలిశారు.. ఏయే ప్రాంతాలకు వెళ్లారనే విషయాలను అధికారులు సేకరిస్తున్నారు. ఇప్పటి వరకూ కరోనా బాధితులు కలిసిన 40 మందిని గుర్తించారు. త్వరలో మిగిలిన వారిని గుర్తిస్తామని అధికారులు చెబుతున్నారు.
ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు
జిల్లాలో ఒక్కసారిగా కరోనా కేసులు బయట పడటంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణలో జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాథ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కరోనా కేసులు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అధిక కేసులు బయటపడిన తంగెళ్లమూడిలో ర్యాపిడ్ సర్వే చేశారు. కరోనా సోకిన వారి కుటుంబాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి: