పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం సత్యవరం గ్రామానికి చెందిన గుబ్బల చంద్రన్న రోడ్లు, భవనాల శాఖలో ఉద్యోగిగా పని చేసి రిటైరయ్యాడు. ఆ తర్వాత 2008వ సంవత్సరంలో మృతి చెందాడు. చంద్రన్న భార్య వెంకాయమ్మకు కుటుంబ పింఛన్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. అప్పటినుంచి వెంకాయమ్మ పింఛను పొందుతూ.. 2018వ సంవత్సరం జనవరిలో మరణించింది. 2017వ సంవత్సరం నవంబరు నెలలో ఆమె బతికున్నట్టు ట్రెజరీ అధికారులకు జీవన ధృవపత్రం సమర్పించారు. ఆమె మృతి చెందినా... కుమారుడు శ్రీనివాస్ ట్రెజరీ అధికారులకు ఎలాంటి సమాచారమివ్వలేదు. దీంతో ప్రతీనెలా ట్రెజరీ నుంచి నేరుగా వెంకాయమ్మ బ్యాంకు ఖాతాకు... 16 నెలల పాటు లక్షా అరవై అయిదు వేల యాభై ఎనిమిది రూపాయలు జమ అయింది. ఈ మొత్తాన్ని వెంకాయమ్మ బ్యాంకు ఏటీఎం కార్డు ద్వారా కుమారుడు తీసేయటంతో...ప్రస్తుతం ఆరు వేల రూపాయలు మాత్రమే ఖాతాలో ఉన్నాయి. 2019వ సంవత్సరం జూన్‌నెలలో ట్రెజరీ అధికారులు... పింఛనుదారుల జీవన పరిస్థితులపై ఫోన్లు చేసి ఆరా తీయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంకాయమ్మ గత సంవత్సరం జనవరి నెలలో చనిపోయినట్టు కుమారుడు శ్రీనివాస్ ట్రెజరీ అధికారులకు చెప్పి మరణ ధృువపత్రాన్ని సమర్పించాడు. వెంకాయమ్మ చనిపోయిన తర్వాత నుంచి తీసుకున్న పింఛను సొమ్మును వెనక్కి జమ చేయాలని ట్రెజరీ అధికారులు శ్రీనివాస్‌కు నోటీసులు పంపారు. ఆయన స్పందించకపోవటంతో... పెనుగొండ సబ్‌ట్రెజరీ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: రైతన్నను కంటతడి పెట్టిస్తున్న వర్షాభావం