Police Attack on Volunteers Accommodation Center: ఏలూరు జిల్లా బేతిపూడిలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర బస కేంద్రం పైకి పోలీసులు మంగళవారం అర్ధరాత్రి దండెత్తారు. నిద్రిస్తున్న వాలంటీర్లపై విచక్షణ రహితంగా లాఠీలతో దాడి చేశారు. దొరికిన వారిని దొరికినట్టు కొట్టుకుంటూ బయటకు ఈడ్చుకెళ్లారు. తమను ఎక్కడికి? ఎందుకు? తీసుకెళ్తున్నారని అడిగితే నోరెత్తనీయకుండా చావబాదారు. బూటు కాళ్లతో తన్నారు. మొత్తం 43 మందిని కొట్టుకుంటూ తీసుకెళ్లి పోలీసు వాహనాల్లో ఎక్కించారు. శిబిరంలో బస చేసిన వాహనాల డ్రైవర్లు, వంట మనుషులను కూడా విపరీతంగా కొట్టారు. బుధవారం రాత్రి వరకు దాదాపు 20 గంటల పాటు వాహనాల్లో వారిని తిప్పుతూనే ఉన్నారు. కనీసం కాలకృత్యాలు తీర్చుకోవటానికీ అనుమతివ్వకుండా హింసించారు. అసలు వారిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారో కూడా చెప్పకుండా వేధించారు. తెలుగుదేశం నాయకులు ప్రశ్నిస్తే చాలాదురుసుగా సమాధానమిచ్చారు. యువగళం పాదయాత్రపై గుణుపూడి వద్ద వైసీపీ శ్రేణులు మంగళవారం దాడి చేశారు. అరాచకం సృష్టించిన అధికార పార్టీ శ్రేణుల్ని వదలేసి.. బాధితులైన తెలుగుదేశం వారిపైనే హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, ప్రమాదకర ఆయుధాలతో దాడి వంటి తీవ్రమైన సెక్షన్ల కింద రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు.
ఎస్సీ వర్గానికి చెందిన దయం బెంజిమెన్ అనే వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా ఒక కేసు, కానిస్టేబుల్ దొంగ రమేష్ ఫిర్యాదుపై మరో కేసు నమోదు చేశారు. ఈ రెండూ కాకుండా భీమవరం పట్టణ వైసీపీ అధ్యక్షుడు తోట భాగయ్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మరో కేసు పెట్టారు. హత్యాయత్నం కింద నమోదు చేసిన కేసుల్లో పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మీ, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తదితరులతో పాటు 52 మందిని నిందితులుగా పేర్కొన్నారు. వీరిలో 38 మంది యువగళం వాలంటీర్లు ఉన్నారు. వీరిని అదుపులోకి తీసుకున్న 20 గంటల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అంతకు ముందు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
Stone Attack by YCP Leaders on Lokesh Padayatra: బుధవారం అర్ధరాత్రి తర్వాత 3 గంటల సమయంలో యువగళం వాలంటీర్లును అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని రెండు వాహనాల్లో ఎక్కించి ముప్పుతిప్పలు పెడుతూ తిప్పించారు. ఓ వాహనంలో ఉన్నవారిని భీమవరం, నర్సాపురం, ఆకివీడు, కలిదిండి, కాళ్ల, తణుకు ఇలా జిల్లాలోని అన్నీ ప్రాంతాల్లో తిప్పుతూ నరకం చూపించారు. మరో వాహనంలో ఉన్నవారిని తణుకు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో తిప్పి చివరికి ఉండి మండలం సీసలిలోని ఓ ప్రైవేటు ఐస్ పరిశ్రమ దగ్గరకు తీసుకెళ్లి అక్కడ నిర్బంధించి ఉంచారు. అది ఉంగుటూరు వైసీపీ ఎమ్మెల్యే వాసుబాబు అనుచరుడి పరిశ్రమని అక్కడికి వారిని తీసుకెళ్లటం ఏంటంటూ టీడీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. వాహనంలో ఉన్నవారు అడిగినందున మూత్ర విసర్జన కోసమే వారిని ఇక్కడికి తీసుకొచ్చామని పోలీసులు సమాధానం చెప్పారు. వారిని కాళ్ల పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి సీఆర్‌పీసీ 41ఏ నోటీసులిచ్చి విడిచిపెట్టేస్తామని చెప్పి వారిని కైకలూరు వైపు తీసుకెళ్లటంతో టీడీపీ కార్యకర్తలు ఆ వాహనాన్ని అడ్డుకున్నారు.
Police Attack on Yuvagalam Volunteers: పోలీసులు వారిని పక్కకు ఈడ్చి పడేసి బారికేడ్లు అడ్డంగా పెట్టారు. ఆ తర్వాత వారిని ఆకివీడు పోలీసుస్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని వాహనానికి అడ్డంగా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులకు నాయకులకు మధ్య కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నాటకీయ పరిణామాలు మధ్యాహ్నం వరకూ కొనసాగాయి. తర్వాత ఆ వాహనాన్ని భీమవరం పోలీస్‌స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత వారిని రాత్రి 8 గంటల సమయంలో కోర్టుకు తరలించి.. హాజరుపరచకుండానే మళ్లీ కొద్దిసేపటికే వెనక్కి తీసుకొచ్చారు. అక్కడ వారిని బెదిరించి, భయపెట్టి బలవంతంగా సంతకాలు తీసుకుంటున్నారంటూ టీడీపీ నాయకులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వారితోనూ పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.
Police Registered Cases of Attempted Murder Against TDP: టీడీపీ వారిపై రెండు హత్యాయత్నం కేసులతో పాటు మరో కేసు పెట్టిన పోలీసులు వైసీపీ మూకల దాడిలో గాయపడ్డ టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి కవురు పృథ్వీ శంకర్ ఇచ్చిన ఫిర్యాదుపై నామమాత్రపు సెక్షన్‌ల కింద ఒక కేసు నమోదు చేసి చేతులు దులిపేసుకున్నారు. నిందితుల పేర్ల స్థానంలో గుర్తుతెలియని వ్యక్తులు అని పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో వైసీపీ జెండా కర్రలు, రాళ్లు విసరుతూ దాడి చేసిన వారి దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. రాళ్లు రువ్వుతున్న వారి ముఖాలు వాటిల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయినా సరే పోలీసులు వైసీపీ నాయకులను నిందితులుగా చేర్చలేదు. తమపై దాడిచేయడమే కాకుండా నారా లోకేశ్ దాడికి ఉసిగొలిపారని ఆయన పేరు చెప్పాలని తమపై పోలీసులు దాడికి పాల్పడ్డారని వాలంటీర్లు వాపోయారు.
TDP Leaders and Activists Protested near Palakollu and Yalamanchili Police Stations: పోలీసుల అదుపులో ఉన్నయువగళం వాలంటీర్లను భీమవరం వన్‌టౌన్ స్టేషన్ వద్ద టీడీపీ నేతలు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ, గన్ని వీరాంజనేయులు పరామర్శించారు. వాలంటీర్లలో అయిదుగురిని నిడమర్రు పోలీసులు బుధవారం రాత్రి తాడేపల్లిగూడెం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. వారిని తణుకు జైలుకు తరలించారు. మిగిలినవారిని రాత్రి భీమవరం కోర్టులో హాజరుపరచగా వాదనలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి, వారికి ఈనెల 18 వరకు రిమాండు విధించారు. భీమవరం ఘర్షణ వివాదం ముగియకుండానే పాలకొల్లు మండలం దిగమర్రు నుంచి చించినాడ వంతెన మధ్య యువగళం పాదయాత్రకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చింపేశారు. దీంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాలకొల్లు, యలమంచిలి పోలీసు స్టేషన్ల దగ్గర ఆందోళన వ్యక్తం చేశారు. చింపేసిన ఫ్లెక్సీలను ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు.