Police Arrested Woman Thief : పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె దగ్గరి నుంచి దాదాపు 12 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నగలను పోగొట్టుకున్న వ్యక్తుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. తణుకు పట్టాణానికి చెందిన నల్లం సూర్య చక్రధరరావు.. భార్య బంధువుల ఇంటికి వెళ్తూ సుమారు 250 గ్రాముల బంగారాన్ని తన వెంట బ్యాగ్లో తీసుకువెళ్లింది. తణుకులో ఆటో ఎక్కి బంధువుల ఇంటికి బయల్దేరింది.
ఇది గమనించిన నిందితులు మేకల పోచమ్మ, బండి దుర్గ, ఈరి మహేశ్లు ఆమె వెనకలే బయల్దేరి కారులో ఆటోను అనుసరించసాగారు. వీరభద్రపురం రాగానే కారు దిగిన బండి దుర్గ, మేకల పోచమ్మలు బాధితురాలు ప్రయాణిస్తున్న ఆటో ఎక్కారు. ఆటోలో సాధారణ ప్రయాణికుల్లా కలిసిపోయి నగలను చోరీ చేశారు. చోరీ చేసిన నగలను తీసుకుని ఈరి మహేష్ కారులో పరారయ్యారు. నిందితులు పారిపోతున్న దారిలో వేల్పూర్ వద్ద పోలీసుల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇది గమనించిన నిందితులు నగలను వేల్పూరులోని తుప్పలలో దాచి పరారయ్యారు. అనంతరం దాచిన నగలను తీసుకు వెళ్లేందుకు వచ్చిన మహిళను పోలీసులు పక్క సమాచారంతో పట్టుకున్నారు.
నిందితురాలు మేకల పోచమ్మ నుంచి నగలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. నిందితురాల్ని రిమాండ్కు తరలించనున్నట్లు వెల్లడించారు. మిగతా ఇద్దరు నిందితులు బండి దుర్గ, ఈరి మహేశ్లు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. బాధితులు ఫిర్యాదు చేసిన వెంటనే బృందాలుగా విడిపోయి.. దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. వీరిపై గతంలో కూడా పలు కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. వీరు ఒంటరిగా ప్రయాణం చేస్తున్న మహిళలనే లక్ష్యంగా చేసుకుని దొంగతనలు చేస్తారని పేర్కొన్నారు. వీరు కారు అద్దెకు తీసుకుని.. రెక్కి నిర్వహించి ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతుంటారని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించారని బాధితులు అంటున్నారు.
ఇవీ చదవండి: