పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా కోడిపందాలకు రంగం సిద్ధమవుతున్న వేళ.. వాటిపై పోలీసులు నియంత్రణ చర్యలను ముమ్మరం చేశారు. హైకోర్టు, ప్రభుత్వ ఉత్తర్వులను తూ.చ. తప్పకుండా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే తణుకు సర్కిల్ పరిధిలో సుమారు 680 మందిపై బైండోవరు కేసులు నమోదు చేశారు. దువ్వ, తేతలి, ఉండ్రాజవరం, అత్తిలి, కొమ్మర, తదితర ప్రాంతాల్లో పరిస్థితులను పరిశీలిస్తున్నారు. 1240 కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. కోడిపందాలు, పేకాట, జూదాలు, గుండాటను అరికడతామన్నారు.
కోడిపందాలు నిర్వహిస్తే తీసుకునే చర్యలను వివరిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కోడికత్తులు కట్టేవారు, స్థలాల యజమానులకు నోటీసులు జారీచేశారు. పందాల్లో పాల్గొనడానికి దూర ప్రాంతాలనుంచి వచ్చేవారిపై నిఘా పెట్టారు. లాడ్జీలు, ఇతర బస సదుపాయాల వివరాలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. పందాలను కచ్చితంగా నిరోధిస్తామని అధికారులు చెపుతుంటే.. నిర్వహించి తీరతామని పందెం రాయుళ్లు స్పష్టం చేస్తున్నారు.
ఇదీ చదవండి: ద్వారకా తిరుమల ఆలయ ద్వారాలకు స్వర్ణ సొబగులు