పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో.. నిధులు దుర్వినియోగం జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. 3.86 కోట్ల రూపాయల అవకతవకలు చోటుచేసుకున్నాయని తెలిపారు. బాధ్యుల ఆస్తులను జప్తు చేసి.. సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి సన్నద్ధమవుతున్నారు.
సూర్యారావుపాలెం సహకార సంఘంలో కొత్త పాలకవర్గం అధికారంలోకి వచ్చిన తర్వాత.. నిధులు దుర్వినియోగం జరిగినట్లు గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. భారీ స్థాయిలో అవకతవకలు ఉన్నట్లు గమనించిన అధికారులు.. సెక్షన్ 51 ప్రకారం విచారణ జరిపారు. ఆ నిధుల్లో 14 లక్షల రూపాయలు రికవరీ చేశారు. మిగిలిన 2.80 కోట్ల రూపాయలను మాజీ అధ్యక్షులు, కార్యదర్శి స్వాహా చేశారని నిర్ధారణకు వచ్చారు. మరో 70 లక్షల రూపాయలను మాయం చేయడంలో డైరెక్టర్ల పాత్ర ఉన్నట్లు తెలిపారు. 22 లక్షల రూపాయలను సంఘంలో పనిచేసే సేల్స్ మెన్లు సొంతానికి వాడుకున్నారన్నారు.
నిధులను దుర్వినియోగం చేసిన సంఘం మాజీ అధ్యక్షులు మద్దుకూరి శ్రీమన్నారాయణ, కార్యదర్శి కొండపల్లి సుబ్రమణ్యంలతో పాటు ముగ్గురు సేల్స్ మెన్ల ఆస్తులను జప్తు చేసినట్లు డివిజనల్ సహకార అధికారి ఆరిమిల్లి శ్రీనివాస్ వెల్లడించారు. కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. సేల్స్ మెన్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా పాలక వర్గానికి సూచించామని తెలిపారు. మిగిలిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకొనే నిమిత్తం.. జిల్లా సహకార అధికారికి నివేదించామని వివరించారు.
ఇదీ చదవండి: ఆరిమిల్లి రాధాకృష్ణ గృహ నిర్బంధం...పోలీసుల తీరుపై తెదేపా ఆగ్రహం