పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంలోని లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు హాజరయ్యారు. గ్రామ సర్పంచ్‌గా అలకనంద దేవిని ఆహ్వానించారు. అయితే తనను పిలిచి అవమాన పరిచారని.. తన చేత ఒక్క ఇళ్ల పట్టా పంపిణీ చేయించలేదని వాపోయారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులతో పాటు.. స్థానిక వైకాపా నాయకుల చేతుల మీదుగా కూడా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన తనతో ఒక్క పట్టా కూడా పంపిణీ చేయించలేదంటూ.. కన్నీటిపర్యంతమయ్యారు. ఇదేంటని ప్రశ్నిస్తే వాళ్లు అధికారం పార్టీ నాయకులమని.. మీరు ప్రతిపక్ష పార్టీ వాళ్లని.. వాళ్లు ఇష్టం వచ్చినట్లు చేసుకుంటామని చెబుతున్నారని ఆమె చెప్పారు.
విషయం తెలుసుకున్న మండలంలోని మిగిలిన పంచాయతీల తేదేపా సర్పంచులు.. దళిత నాయకులు, తెదేపా నాయకులు ఆమెకు మద్దతుగా నిలిచారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. వైకాపా నాయకుల ఆగడాలను అరికట్టాలన్నారు. తహసీల్దార్ అందుబాటులో లేని కారణంగా.. ఎంపీడీఓ విజయలక్ష్మికి వినతిపత్రం అందజేసి.. తమకు న్యాయం చేయాలని కోరారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే సహించబోమని తెదేపా నాయకులు హెచ్చరించారు.
ఇవీ చూడండి: