పశ్చిమగోదావరి జిల్లాలోని యలమంచిలి మండలం మట్లపాలెం జిల్లాలో తొలి పంచాయతీగా ఏర్పడింది. స్వాతంత్య్ర సమరంలో ఈ గ్రామస్థులంతా సమర యోధులై చైతన్యంతో పోరాటానికి కదలడంతో మహాత్ముని ప్రశంసలు అందుకున్నారు. ఈ క్రమంలోనే మట్లపాలెం జిల్లాలో తొలి పంచాయతీగా ఏర్పాటైంది. అలనాటి నుంచి మహాత్ముడు చూపిన బాటలో సాగుతున్న ఈ గ్రామం... పచ్చదనం, పరిశుభ్రతతో ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడ ఒక్క పూరిల్లు కూడా కనిపించని విధంగా గత పాలకులు ఈ పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దిన తీరు కనిపిస్తుంటుంది. ఇంకా చెప్పాలంటే గొడవలు, వివాదాల కారణంగా స్థానికులు పోలీస్‌స్టేషన్ గడప తొక్కే సందర్భాలు అరుదు. ఎక్కువ సార్లు సర్పంచి పదవి ఏకగ్రీవమైన చరిత్ర మట్లపాలెం సొంతం. ఇక్కడ ఆదర్శ సర్పంచిగా పనిచేసి మృతి చెందిన మహిళ పేరిట గ్రామంలో స్తూపం కూడా ఏర్పాటు చేశారు.
స్వచ్ఛతను మెచ్చి
పారిశుద్ధ్య నిర్వహణలో ఆదర్శంగా నిలిచి ఉత్తమ పురస్కారాలు అందుకున్న గ్రామాలు జిల్లాలో ఎన్నో ఉన్నాయి. మైనర్ పంచాయతీ అయిన బుట్టాయగూడెం గత పాలకుల హయాంలో సంపద సృష్టి కేంద్రం నిర్వహణ విభాగంలో రాష్ట్రస్థాయి అవార్డు సాధించింది. పోలవరం మండలం ఎల్.ఎన్.డి.పేట (లక్ష్మీనారాయణిదేవిపేట) జాతీయస్థాయిలో నిర్మల్ పురస్కారం, తర్వాత స్వచ్ఛభారత్ పురస్కారాలను అందుకోవడం విశేషం. పాలకొల్లు మండలం లంకలకోడేరు, శివదేవునిచిక్కాల, వడ్లవానిపాలెం పంచాయతీలు జిల్లా స్థాయిలో ఉత్తమ అవార్డులు సాధించాయి.
ఒకే మాట.. ఒకే బాట
దశాబ్దాలుగా పంచాయతీ పాలకులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ ఆదర్శంగా నిలుస్తోంది జీలుగుమిల్లి మండలంలోని టి.గంగన్నగూడెం గిరిజన గ్రామం. ఒకేమాట.. ఒకే బాట అన్నట్లు జీవించే ఇక్కడి ప్రజలు సామాజిక చైతన్యం చూపుతున్నారు. ఈ గ్రామానికి 2008లో జాతీయ స్థాయిలో నిర్మల్ గ్రామ పురస్కార్, రాష్ట్ర స్థాయిలో శుభ్రం అవార్డులు లభించాయి. 2008 జనవరి 26న అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ నుంచి గ్రామ సర్పంచి తాటి అప్పారావు నిర్మల్ పురస్కార్ అందుకున్నారు. అదే ఏడాది శుభ్రం అవార్డును ఉపసర్పంచి కొమరం వెంకటేశ్వరరావు అప్పటి సీఎం రాజశేఖరరెడ్డి నుంచి అందుకున్నారు. పారిశుద్ధ్యం, నూరుశాతం పన్నుల చెల్లింపు వంటి అంశాల్లో ఈ గ్రామం ముందు వరుసన నిలుస్తోంది. 1990 నుంచి ఇప్పటి వరకు ఐదు పర్యాయాలు ఇక్కడ పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుత ఎన్నిక ఏకగ్రీవానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: పల్లెకూ ఉంది ఓ బడ్జెట్