పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని కృష్ణాడెల్టా చివరి ఆయకట్టు రైతులు.. సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుక్కి దున్ని విత్తనం వేసినా, ఇప్పటివరకు మొక్క మొలవక.. వరుణుడి రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఏటా జులై పూర్తయ్యే నాటికి వరి నాట్లు పూర్తయ్యేవి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ఇప్పటికే వరినాట్లు పూర్తికావాల్సి ఉండగా, నారుమడులు సైతం వేసుకోలేని పరిస్థితి నెలకొంది.
అక్కడక్కడా రైతులు వేసిన నారుమళ్లు సైతం ఎండిపోతున్నాయి. వర్షాలు లేక ఒకవైపు అన్నదాత ఇబ్బంది పడుతుంటే, పట్టిసీమ నుంచి వదిలిన అరకొర సాగునీరు కూడా వీరికి అందడం లేదు. ఈసారి ఖరీఫ్ సీజన్‌లో పంట సాగు కష్టమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి నీరు వచ్చేటప్పటికి ఆలస్యం అయ్యేదని.. పట్టిసీమ ప్రారంభించాక ఆ ఇబ్బందులు తొలగిపోయాయని రైతులు అంటున్నారు. చివరి ఆయకట్టు రైతులైన తమకు నీరు అందడం లేదని.... పైభాగంలో ఉన్న కృష్ణా జిల్లా రైతుల అవసరాలు తీరాకే కిందికి విడుదల చేస్తున్నారని చెబుతున్నారు. కాలువ సామర్థ్యం 800 క్యూసెక్కులు కాగా, ప్రస్తుతం 180క్యూసెక్కులు మాత్రమే వదులుతున్నారని .. ఆ నీరు తమకు అందడం గగనమే అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పట్టిసీమ ప్రవాహాన్ని పెంచడంతో పాటు తమకు మార్గమధ్యలోనే నీటిని తోడుకునే అవకాశం ఇవ్వాలని.. లేనిపక్షంలో ఖరీఫ్ సాగు కష్టమనే అభిప్రాయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు.