జిల్లాకు చెందిన చింతలపాటి వర ప్రసాద మూర్తి రాజు.. ఎన్నో కళాశాల ఏర్పాటు చేశారు. వాటిలో ఒకటి భీమవరంలోని కస్తూర్భా జూనియర్ కళాశాల. ఈ విద్యా నిలయం ఏర్పాటుకు భీమవరానికి చెందిన ఓ దాత స్థలాన్ని ఇచ్చారు. అందులో 1969 మూర్తి రాజు కస్తూర్బా జూనియర్ కళాశాల (ఎయిడెడ్) నిర్మించారు. ఈ కళాశాల పేరు మార్చి ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసింది.
ప్రస్తుత ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తండ్రి వెంకటేశ్వర రావు పేరు మీద ఈ కళాశాలను మారుస్తూ జీవో వచ్చింది. దేశ నాయకుల పేరును పూర్తిగా తొలగించి కళాశాలకు దాత పేరు పెట్టడం సరికాదని గాంధేయవాదులు అంటున్నారు. దేశ నాయకుల పేరు అలాగే ఉంచి దాత పేరు కూడా పెట్టుకోవాలని కోరుతున్నారు.
న్యాయస్థానం తీర్పుతో మారిన కళాశాల
భీమవరంలోని ఎస్సార్ నగర్ ప్రాంతంలో ఏర్పాటుచేసిన కస్తూర్భా జూనియర్ కళాశాలను 1977లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. గతంలో స్థలం ఇచ్చిన వారి వారసులు కోర్టును ఆశ్రయించారు. కోర్టులో వారసులకు అనుకూలంగా 2007లో తీర్పు వచ్చింది. కళాశాల ఖాళీ చేసి వేరే చోటకు తరలించడం తప్పనిసరైంది. మరోచోట కళాశాల ఏర్పాటు చేసేందుకు భీమవరం పట్టణ ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కళాశాల నిర్మాణం కోసం ప్రస్తుత ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తన తండ్రి పేరు మీద 37 సెంట్ల స్థలాన్ని దానంగా ఇచ్చారు. సుమారు రూ.మూడు కోట్ల విలువైన స్థలాన్ని కళాశాల నిర్మాణం కోసం దానం చేశారు. నాబార్డు నిధులు రూ.రెండున్నర కోట్లతో నూతన కళాశాల నిర్మాణం ఆ ప్రాంతంలో చేపట్టారు.
2017 నుంచి నూతనంగా నిర్మించిన కళాశాల ప్రాంగణంలో కస్తూర్భా జూనియర్ కళాశాల కొనసాగుతోంది. ఈ కళాశాలకు ప్రభుత్వం గ్రంధి వెంకటేశ్వరరావు పేరును ఖరారు చేస్తూ ఇటీవల జీవో జారీ చేసింది. ఈ జీవోను నిలుపుదల చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారక నిధి సంస్థ సభ్యులు, జిల్లా సర్వోదయ మండలి సభ్యులు ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా ఇటీవల పంపించారు. అయితే కళాశాల పేరు మార్పు సంబంధించి తమకు ఎటువంటి ఆదేశాలు అందలేదని కళాశాల ప్రిన్సిపాల్ వి.వి. సత్యనారాయణ చెబుతున్నారు.