నిరుపేద చేతి వృత్తిదారుల కోసం 'జగనన్న చేదోడు' పథకం పేరిట ప్రభుత్వం సాయం అందించనుంది. ఈ పథకాన్ని ఇవాళ ప్రారంభించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఈ పథకం కింద 21,096 లబ్ధిదారులకు.. 21 కోట్ల 9 లక్షల 60 వేల రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. నవశకం సర్వేలో భాగంగా గడిచిన డిసెంబర్, జనవరి నెలల్లో దర్జీలు, రజకులు, నాయిబ్రాహ్మణుల నుంచి వాలంటీర్లు దరఖాస్తులు స్వీకరించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం అర్హులైన లబ్ధిదారుల దరఖాస్తులను ఆన్లైన్ చేసి వారి దుకాణాలను జియో ట్యాగింగ్ చేశారు.
జిల్లాలో ఈ మూడు విభాగాలకు సంబంధించి 58,644 మంది దరఖాస్తు చేసుకోగా 21,096 మంది మాత్రమే జగనన్న చేదోడు పథకానికి అర్హత సాధించారు. 37,548 మందిని అధికారులు అనర్హులుగా గుర్తించారు. కుటుంబమంతా వృత్తిపై ఆధారపడిన వారిని ప్రామాణికంగా తీసుకున్నారు. లబ్ధిదారులు గుర్తించే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని బీసీ కార్పొరేషన్ అధికారులు చెప్తున్నారు. జీవనాధారంగా ఉండి, దుకాణాలు ఉన్న వారిని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నామని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: సరస్వతి పవర్ సున్నపురాయి లీజు గడువు పెంపు