పశ్చిమ గోదావరిజిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లల్ని చదివించడానికి తల్లిదండ్రులు పోటీపడుతున్నారు. జిల్లాలో పదుల సంఖ్యలో ప్రభుత్వోన్నత పాఠశాలల్లో సీట్లు లేవని బోర్డులు వెలిశాయంటే పరిస్థితి అర్థమవుతుంది. సిఫార్సుల లేఖలతో బడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఉన్నతాధికారులు సైతం వీటివైపే చూస్తున్నారు.
ఏలూరు, సత్రంపాడు, తణుకు, నరసాపురం, ఆకివీడు, శనివారపుపేట, భీమడోలు, దువ్వ, పాలకొల్లు ఉన్నత పాఠశాలలు విద్యార్థులతో కిక్కిరిపోతున్నాయి. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తయారయ్యాయి. విద్యాప్రమాణాలు మెరుగు, ఉపాధ్యాయుల బాధ్యత, చిత్తశుద్ధితో బోధించే పాఠాలతో ఈ మార్పు సాధ్యమైంది. విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సత్రంపాడు, తణుకు, ఆకివీడు, నరసాపురం పాఠశాలల్లో ఉన్నత కుటుంబాలకు చెందిన పిల్లలు చదువుతున్నారు.
గతేడాది నుంచే విద్యార్థుల తాకిడి అధికమైంది. ఈ ఏడాది సీట్ల కోసం ముందుగానే దరఖాస్తులు చేసుకొన్నారు. కొందరైతే.. నాయకుల సిఫార్సులు లేఖలు తీసుకెళ్తున్నారు. ఒక్కో తరగతిని 4సెక్షన్లుగా విభజించి పాఠాలు బోధిస్తున్నారు. జిల్లాలో 12 ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లులేవని ఇప్పటికే బోర్డులు పెట్టారు. జిల్లాలో 447ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 1.46లక్షలమంది విద్యార్థులు చదువుకొంటున్నారు. ఆరు నుంచి పదోతరగతి వరకు 20వేలకు పైగా కొత్త విద్యార్థులు వివిధ తరగతుల్లో ఈ ఏడాది ప్రవేశం పొందారు. గతేడాది కంటే.. ఈ సంఖ్య 20శాతం అధికం. ఏలూరు మండలం సత్రంపాడు ఉన్నతపాఠశాలలో గతేడాది 370మంది విద్యార్థులే ఉండేవారు. ప్రస్తుత 650కి చేరింది. ప్రవేశాల కోసం వచ్చే విద్యార్థులను వెనక్కి పంపలేక ఇబ్బంది పడుతున్నట్టు ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు.
విద్యార్థుల సంఖ్య పెరిగే కొద్ది గదులు, సిబ్బంది సమస్య మొదలైంది. తాత్కాలికంగా బదిలీలకు జిల్లా ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడానికి విద్యాప్రమాణాల్లో వచ్చిన మార్పులే కారణం అంటున్నారు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు. కొన్ని పాఠశాలల్లో ఐఐటీ ఫౌండేషన్ కోర్సు ప్రవేశపెడుతున్నారు. డిజిటల్, వర్చువల్ తరగతులు చేపడుతున్నారు. ఆంగ్లమాధ్యమబోధన దీటుగా అమలు చేస్తున్నారు.
విద్యావిధానం బాగుంటే.. ప్రభుత్వ బడులు బోసిపోవని.. విద్యార్థులతో కిక్కిరిసిపోతాయని ఈ పాఠశాలలు రుజువుచేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి: