పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకపల్లికి చెందిన ఎస్సీ యువకుడు గెడ్డం శ్రీనివాసరావు మృతదేహాన్ని తవ్వితీసి.. మళ్లీ శవపరీక్ష నిర్వహించాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. గుంటూరు వైద్యకళాశాల నుంచి ఇద్దరు, మంగళగిరి ఎయిమ్స్ నుంచి ఒకరు......మొత్తం ముగ్గురు వైద్యలు శవపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. పరీక్షను వీడియో తీసి.. కేసు విచారణ కోసం భద్రపరచాలని ధర్మాసనం నిర్దేశించింది. పోస్టుమార్టం రిపోర్ట్ రాతపూర్వకంగా ఇవ్వాలని ఆదేశించింది. 15 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలన్న న్యాయస్థానం పోస్టుమార్టం నిర్వహణకు పోలీసులు, రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేయాలని నిర్దేశించింది. ప్రస్తుతం ఉన్న డీఎస్పీ ఆధ్వర్యంలోనే దర్యాప్తు కొనసాగించాలని సూచించింది.
గతేడాది అక్టోబర్6న గెడ్డం శ్రీను అనుమానస్పద స్థితిలో చనిపోయాడు.తాను పనిచేసే రైతు పొలంలోనే విగతజీవిగా పడి ఉండటం పలు అనుమానాలకు తావిచ్చింది. ఓ విశ్రాంత పోలీసు అధికారి ఆదేశాలతోనే మృతదేహాంపై ఆనవాళ్లు తొలగించారని... పోలీసులు రాకముందే ఆ ప్రాంతం కడిగేశారంటూ రీపోస్టుమార్టం నిర్వహించాలని శ్రీను తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. పోస్టుమార్టం నివేదికలో స్పష్టత లేదంటూ పోలీసుల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం మలకపల్లిలో వర్గవిభేదాలు ఉన్న కారణంగా మళ్లీ పోస్టుమార్టం నిర్వహించి నివేదిక అందించాలని ఆదేశించింది.
ఇదీ చదవండి: శ్రీకాళహస్తిలో దారుణం... మురుగుకాలువలో శిశువు మృతదేహం